
వడదెబ్బ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు చనిపోయారు. భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన గుర్రం ప్రసాద్ రావు (53) ఎండ దెబ్బకు గురై గురువారం మృతి చెందాడు. గత మూడు రోజులుగా గ్రామంలోని కూలీలంతా తానం ధర్మరాజు వ్యవసాయ భూమిలో చదును పనులు చేస్తున్నారు. ప్రసాద్ రావు కూడా పనికి వెళ్లాడు. కానీ.. కూలీల మాస్టర్లో ఆయన పేరు లేకపోవడంతో ఇంటికి తిరిగి వచ్చాడు. అస్వస్థతకు గురైన ఆయన.. పడుకున్నాడు. చివరికి నిద్రలోనే చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.
అదే జిల్లాలోని పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన తోట భూలక్ష్మి (67) వడదెబ్బతో చనిపోయింది. అదేవిధంగా, మెదక్ జిల్లా కొల్చారం గ్రామానికి చెందిన కుమ్మరి శాఖయ్య అలియాస్ ఏడు కొండలు (53) వడ దెబ్బతో చనిపోయాడు. శాఖయ్య ఆమ్ చూర్ తయారీ వ్యాపారం చేస్తాడు. పది రోజులుగా చుట్టుపక్క గ్రామాల నుంచి మామిడి కాయలు తీసుకొస్తూ కొల్చారంలో కూలీలతో టంకర తయారు చేయిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం మామిడి కాయలు తీసుకొచ్చేందుకు రంగంపేట గ్రామానికి వెళ్లాడు. దీంతో అస్వస్థతకు గురి కావడంతో స్థానికులు మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో చనిపోయాడు.