హైదరాబాద్, వెలుగు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ బుధవారం రాష్ట్రానికి రానున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారి తెలంగాణకు వస్తుండడంతో రాష్ట్ర నాయకత్వం భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తోంది. నితిన్ నబిన్ మహబూబ్‌నగర్‌లో జరగనున్న కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొని, మున్సిపల్ ఎన్నికల సమరానికి క్యాడర్‌ను సన్నద్ధం చేయనున్నారు.
ఆయన మధ్యాహ్నం ఒంటి గంటకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కాకుండా రోడ్డు మార్గంలోనే మహబూబ్‌నగర్‌కు వెళ్లనున్నారు. క్యాడర్‌ను ఉత్సాహపరుస్తూ వెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. శంషాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వెళ్లే దారిలో జాతీయ రహదారి వెంబడి ప్రధాన చౌరస్తాల్లో స్వాగత పాయింట్లు ఏర్పాటు చేశారు. నబిన్ ఆయా పాయింట్ల వద్ద ఆగుతూ కార్యకర్తలను కలుస్తూ పాలమూరుకు చేరుకుంటారు. అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
అన్ని మున్సిపాలిటీల్లో లైవ్ స్ర్టీమింగ్: రాంచందర్ రావు
నితిన్ నబిన్ రాష్ట్రానికి రావడం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఆయన పర్యటన కీలకమైందని చెప్పారు. మహబూబ్‌నగర్ సభను అన్ని మున్సిపాలిటీల్లో లైవ్ స్ర్టీమింగ్ చేస్తామని తెలిపారు. పార్టీకి వెన్నెముక కార్యకర్తలేనని, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకే ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు పాలమూరు, చుట్టుపక్కల ప్రాంతాల కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు.
