- బీఆర్ఎస్‌తో పొత్తు ఆలోచన లేదు
- బీజేపీలో లేఖల సంస్కృతి లేదు
- మీడియా చిట్ చాట్లో ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: విద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టేందుకు ‘హేట్ స్పీచ్’ బిల్లు తెస్తామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. తన పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలను విషనాగులని సంబోధించి, వాటిని చంపాలని ఖర్గే అనడం ముస్లింలను రెచ్చగొట్టడమేనని, ఇది హేట్ స్పీచ్ కిందకు రాదా అని నిలదీశారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ మనుగడ సాగించడం ఇప్పుడు అంత ఈజీ కాదని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ఆ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. కవిత ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుతుండవచ్చనీ, కానీ అధికారంలో ఉన్నప్పుడే ఈ విషయాలు చెబితే బాగుండేదన్నారు. ఇప్పుడు ఆమె వేస్తున్న ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతలే సమాధానం చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
ఎన్నికల ఫలితాలను బట్టి పార్టీ భవిష్యత్తును అంచనా వేయలేమని, గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ వైపు గాలి వీచినా.. లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి 8 సీట్లు ఇచ్చి 38 శాతం ఓటు బ్యాంకును అందించారని గుర్తుచేశారు. జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎంపికవుతారని ఎవరూ అంచనా వేయలేదన్నారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహిళా బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు కానీ, గెలవడం అంత సులువు కాదని పేర్కొన్నారు.
