రేవంత్ పై బీజేపీ అధికార ప్రతినిధి రచనా రెడ్డి ఫైర్

రేవంత్ పై బీజేపీ అధికార ప్రతినిధి రచనా రెడ్డి ఫైర్

హైదరాబాద్, వెలుగు:  వర్షాలు, వరదలు వచ్చినప్పుడు వెంటనే స్పందించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని బీజేపీ అధికార ప్రతినిధి రచనారెడ్డి అన్నారు. మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కన పెట్టి రేవంత్​ రెడ్డి కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని ఫైరయ్యారు. పీసీసీ చీఫ్​తోపాటు కాంగ్రెస్​ నాయకులు బురద రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఆదివారం ఆమె పార్టీ స్టేట్​ ఆఫీస్​లో మీడియాతో ఆమె మాట్లాడారు. 

వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్ డీఆర్ ఎఫ్ టీమ్​లను రంగంలోకి దింపారని, ప్రత్యేక హెలికాప్టర్లను రప్పించి ప్రజల ప్రాణాలు కాపాడారని గుర్తు చేశారు. వరదల నష్టం అంచనా వేయడానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపుతున్నారన్నారు. భూపాలపల్లి జిల్లాలోని మోరాంచపల్లికి ఏ కాంగ్రెస్ ​నేత కూడా వెళ్లలేదని, కేంద్రమే టీమ్​లను పంపిందన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా వరద ప్రాంతాల్లో బీజేపీ నేతలు పర్యటిస్తూ నష్టాన్ని అంచనా వేస్తున్నారన్నారు. పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి కన్పించడం లేదని మల్కాజ్​గిరిలో పోస్టర్లు వేశారని అన్నారు. నియోజకవర్గంలో ఎన్ని ఎంపీ లాడ్స్​ ఖర్చు చేశారో రేవంత్​ చెప్పాలన్నారు.