ఎన్నో దశాబ్దాలుగా చట్టసభల్లో సాధికారిక ప్రాతినిధ్యం కోసం ఎదురుచూస్తున్న మహిళల కల సాకారమవుతున్న సందర్భంగా తెలంగాణ మహిళల తరఫున ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు. మేనిఫెస్టోలు అన్ని పార్టీలు రాస్తాయి. ప్రమాణాలు అందరూ చేస్తారు. కానీ, ప్రజాసంక్షేమం కోసం ఇచ్చిన మాటకు, రాసిన రాతకు కట్టుబడి అమలు చేసేవారు మాత్రం కొందరే ఉంటారు. వారే ప్రజానాయకులు అవుతారు, చరిత్రలో నిలిచిపోతారు.
అటువంటి మహనీయుడే ప్రధాని నరేంద్ర మోదీ. 2014లో మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత బీజేపీ వ్యవస్థాపకులు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ రూపొందించిన అంత్యోదయ సిద్ధాంతాన్ని ఆచరణలోకి తేవడంలో సఫలీకృతం అయ్యారు. అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం ప్రజాస్వామ్య ఫలితాలు ఆఖరి వ్యక్తికి కూడా అందించాలంటే.. జనాభాలో సగభాగం ఉన్న మహిళల గురించి ముందుగా ఆలోచించాలి.
అవకాశాలు ఇస్తే మహిళలు కుటుంబాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోగలరో.. దేశ ఆర్థిక వ్యవస్థను అలాగే పెంచగలరు. అందుకే వంటింటి నుంచి పార్లమెంటు దాకా, అట్టడుగు నుంచి అధికారం దాకా మహిళల అభ్యున్నతి కోసం ఒక ప్రణాళికను రూపొందించి చిత్తశుద్ధితో అమలు చేస్తోంది మోదీ ప్రభుత్వం. వంటగ్యాసూ ఇవ్వాలి.. పార్లమెంటులో సీట్లూ ఇవ్వాలి అంటూ దేశవ్యాప్తంగా దిగువ మధ్యతరగతికి చెందిన 10.56 కోట్ల కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం ద్వారా మహిళలకు వంటింటి సమస్యల నుంచి ఉపశమనం కల్పించారు ప్రధాని మోదీ. 2014కు ముందు స్వాతంత్ర్యం వచ్చి 60 ఏళ్లు అయినా మహిళల శౌచాలయాల సౌకర్యాల గురించి కూడా కనీసం ఆలోచించని ప్రభుత్వాలను మనం చూశాం.
కానీ, అధికారంలోకి వచ్చిందే తడవు.. తండ్రిలాగ ఆలోచించి 12 కోట్ల శౌచాలయాల నిర్మాణాన్ని ప్రధాని మోదీ పూర్తిచేయించారు. నెలసరి అవసరాలను తీర్చే శానిటరీ ప్యాడ్స్ ను ఒక రూపాయికే అందించారు. ఆడబిడ్డల భ్రూణ హత్యలను తగ్గించేందుకు చర్యలు తీసుకుని జనాభా నిష్పత్తిలో మహిళల శాతాన్ని పెంచారు. పాఠశాలల చదువు నుంచి ఆర్మీలో ఉద్యోగం దాకా బేటీ పడావో- బేటీ బచావో, ప్రధానమంత్రి సురక్షిత్ మాతృవందన్ అభియాన్, సుకన్య సమృద్ధి యోజన, లఖ్ పతి దీదీ యోజన వంటి పథకాల ద్వారా మహిళాభ్యుదయానికి తోడ్పడ్డారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా 4 కోట్ల మందికి ఇండ్లు ఇచ్చి, అందులో 60 శాతం పైగా మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్లు చేయించడం ద్వారా మహిళలకు ఇంటి యజమానిగా హక్కు కల్పించారు. త్రివిధ దళాల్లో మహిళలకు ఉద్యోగాలు కల్పించడం ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది మోదీ ప్రభుత్వం. 2024 జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున మహిళా పదాధికారుల నాయకత్వంలో భారత త్రివిధ దళాల కవాతు ప్రపంచాన్నే అబ్బురపరిచింది. పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన ఆపరేషన్ సిందూర్‌కు నాయకత్వం వహించే అవకాశం మహిళా కమాండర్స్ కు ఇచ్చింది మోదీ ప్రభుత్వమే.
- మహిళలే దేశ ఆర్థిక శక్తికి ఊతం
50 శాతం మంది మహిళలు వంటింట్లో ఉంటే దేశ ఆర్థిక ప్రగతి ఎలా సాధ్యమవుతుంది? చదువు, తెలివి ఉండి, సామర్థ్యం ఉండి ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ,, శ్రామిక రంగాల్లో పనిచేస్తూ సమాన వేతనం పొందని మహిళలు కోట్లమంది ఉన్నారు. అందుకే మహిళలకు చేయూత కోసం అనేక మార్గాలను అన్వేషించింది మోదీ ప్రభుత్వం. వారికి వచ్చిన పని ద్వారా వ్యాపారవేత్తలుగా మార్చాలంటే కాస్త పెట్టుబడి, ప్రోత్సాహం అవసరమనే విషయాన్ని గమనించి ముద్ర లోన్ల దగ్గర నుంచి స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా ద్వారా ష్యూరిటీ అవసరం లేని లోన్లను ఇచ్చింది.
ఎస్సీ, ఎస్టీ మహిళలకు సబ్సిడీలు కూడా అందించి కోట్ల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చింది మోదీ ప్రభుత్వం. భారత దేశం ఈరోజు ప్రపంచంలోనే సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల్లో నాలుగో స్థానానికి ఎగబాకింది. మహిళలకు చదువు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే ఇంత అభివృద్ధి సాధ్యమైతే.. మరి చట్టాలు చేసి పరిపాలించే నిర్ణయాధికారాలు ఉన్న స్థానాల్లో మహిళలు ఉంటే ఇంకా ఎన్నో అద్భుతమైన ఫలితాలు మనం చూడగలం.
- చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యమివ్వాలి
2047 స్వాతంత్ర్య దినోత్సవం నాటికి వికసిత్ భారత్ -2047 లక్ష్యాలు సిద్ధించాలంటే చట్టసభల్లో ఎక్కువమంది మహిళలు ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రజాప్రతినిధులుగా మహిళలు సున్నితమైన అంశాలను సైతం అర్థంచేసుకోగలరు. త్వరితగతిన సమస్యలను పరిష్కరించగలరు. కానీ, మహిళల పోరాటాన్ని
దానివెనుక ఉన్న సంఘర్షణను చాలా రాజకీయ పార్టీలు అర్థంచేసుకోలేకపోయాయి. స్వాతంత్ర్యం అనంతరం 50 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయలేకపోయింది. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లు తాము అనుకూలమని చెబుతూనే తమ మిత్రపక్షాలతో వ్యతిరేకింపజేస్తూ మహిళా బిల్లును అడ్డుకుంటూ వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అయినా ఇంకా మనదేశంలో పార్లమెంటులో మహిళల సంఖ్య 13.6 శాతం మాత్రమే ఉంది.
మహిళా ప్రాతినిధ్యం ఉన్న దేశాలు ప్రపంచ వ్యాప్తంగా 185 ఉంటే.. భారతదేశం అందులో 143వ స్థానంలో ఉండటం మనకే అవమానం. వాస్తవానికి 50 శాతం ఉండాలి. కానీ, జనరల్ స్థానాల్లో కూడా మహిళలు పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి 33 శాతం రిజర్వ్ చేస్తే, తదుపరి 50 శాతానికి మహిళలు చేరుకోగలరు. 1996కు ముందు అంతా కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నా, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు కనీసం ప్రవేశపెట్టలేదు.
- మహిళా సాధికారితకు సువర్ణ అధ్యాయం
2014, 2019 ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలు కచ్చితంగా అమలు చేయాలనే
చిత్తశుద్ధితో ఉన్న మోదీ ప్రభుత్వం ముందుగా బీజేపీ సంస్థాగత కమిటీల్లో 33% మహిళలకు అవకాశం ఇచ్చి ఆదర్శంగా నిలిచింది. 2023 సెప్టెంబరులో ఉభయసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి విజయవంతంగా బిల్లు పాస్ చేయించింది. భారతదేశ చరిత్రలో బీజేపీ మహిళల సాధికారిత కోసం ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది.
ప్రస్తుత స్థానాల్లో 33 % ఇస్తే మహిళలకు దక్కే సంఖ్య కంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగి మహిళా బిల్లు అమలైతే చట్టసభల్లో మహిళల సంఖ్య రెట్టింపు అవుతుంది. చిన్న నియోజకవర్గాల్లో పరిపాలన సులభతరం అవుతుంది. అది అర్థం చేసుకోలేని విపక్ష పార్టీలు, కాంగ్రెస్ సారథ్యంలో డీలిమిటేషన్ ప్రక్రియను ఆపాలని, తద్వారా మహిళా రిజర్వేషన్లు అమలు కాకుండా చూడాలని కుట్ర చేస్తున్నాయి.
- వింత ప్రతిపాదనలతో లొల్లి సరికాదు
దక్షిణాది విపక్ష పార్టీల నేతలు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వింత ప్రతిపాదనలతో లొల్లి చేయాలని చూస్తున్నారు.50% ప్రో-రేటా ఆధారంగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేస్తూ పునర్విభజన చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంటే..ఏ శాస్త్రీయత ప్రకారం చేస్తున్నారని రేవంత్ ప్రశ్నించడం శోచనీయం. నిజానికి ప్రభుత్వ అధినేతగా ఆలోచించి, నియోజకవర్గాల పెంపు జరిగి మహిళా బిల్లు అమలు జరిగేలా సహకరించాలి. తెలంగాణలో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా మహిళా బిల్లుకు సహకరించాలి.
- దేవెగౌడ నుంచి మన్మోహన్ దాకా సాధ్యం కాలేదు
1996లో దేవెగౌడ సంకీర్ణ ప్రభుత్వం మొదటిసారి మహిళా బిల్లును ప్రవేశపెట్టింది. తదుపరి ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టి చేతులు దులుపుకున్నారు. వాజ్‌పేయి ప్రభుత్వం నాలుగుసార్లు ప్రవేశపెట్టినా మిత్రపక్షాల సహకారం లేక ముందుకు వెళ్లలేకపోయింది. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యసభలో పాసైన బిల్లును
లోక్ సభలో పాస్ చేయించలేకపోయింది.
అది మోదీకే సాధ్యమైంది.
- రాణి రుద్రమ రెడ్డి
రాష్ట్ర అధికార ప్రతినిధి, బీజేపీ తెలంగాణ
Note: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితల ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.

