కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తమ పార్టీ బృందానికి అనుమతివ్వాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, వరదల్లో మోటర్ల మునకపై తాము సమాచారం తెలుసుకోవాలని అనుకుంటున్నామని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవాలనుకుంటున్నామని తెలిపారు. పార్టీ బృందంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ ఎక్స్ పర్ట్స్ మొత్తం 30 మంది ఉంటారని తెలిపారు.
సెప్టెంబర్ మొదటి వారంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు అనుమతి ఇవ్వాలని సంజయ్ కోరారు. వరదల వల్ల మోటర్లకు ఏర్పడిన నష్టాన్ని పరిశీలించడమే బీజేపీ బృందం పర్యటన లక్ష్యమన్నారు. ప్రభుత్వం ఇరిగేషన్ అధికారులను పంపి సందేహాలను నివృత్తి చేయాలని కోరారు. 1998 వరదలతో శ్రీశైలం టర్బైన్స్ దెబ్బతిన్నప్పుడు ప్రతిపక్షాలు ప్రాజెక్టును సందర్శంచాయని గుర్తు చేశారు.
