మోసపూరిత హామీలతో కాంగ్రెస్‌‌‌‌ పాలన: రామచందర్ రావు

మోసపూరిత హామీలతో కాంగ్రెస్‌‌‌‌ పాలన: రామచందర్ రావు
  •      తెలంగాణను కేంద్రం పట్టించుకోవడం లేదనడం అవివేకం
  •     బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌‌‌‌రావు


మహబూబాబాద్, వెలుగు : మోసపూరిత హామీలతోనే కాంగ్రెస్‌‌‌‌ పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌‌‌‌రావు విమర్శించారు. మహబూబాబాద్‌‌‌‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ జిల్లా కార్యకర్తల శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌‌‌‌ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు సక్రమంగా జరగకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే నెలల తరబడి పడిగాపులు పడుతున్నారన్నారు. వడ్లు కొనకుండా కేంద్రాన్ని బద్నాం చేయడం సరికాదన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎంత ధాన్యం సేకరించారన్న లెక్కలపై మంత్రుల మధ్యనే పొంతన లేదని ఎద్దేవా చేశారు. 

స్టూడెంట్లకు పెండింగ్‌‌‌‌లో ఉన్న రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ బకాయిలను ఇప్పటివరకూ చెల్లించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా... రాష్ట్రంలో పేదలకు ఇండ్ల నిర్మాణం సక్రమంగా జరగడం లేదన్నారు. రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోందని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. 32 జిల్లాల పరిధిలో నేషనల్‌‌‌‌ హైవేల విస్తరణ జరుగుతోందని, ఇటీవల కొత్తగా రూ.8 వేల కోట్లు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. మోదీ పీఎం అయిన తర్వాత తెలంగాణలో వివిధ పథకాల కోసం సుమారు రూ.13 లక్షల కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీలను ఓటు బ్యాంక్‌‌‌‌గానే చూస్తున్నారని, వారి సంక్షేమాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో బీజీపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు, నాయకులు సీతయ్య, మదన్‌‌‌‌, రాంచంద్రారావు, అశోక్​  పాల్గొన్నారు.