అభివృద్ధి ముసుగులో ..అభాగ్యుల బతుకులు ఆగం చేయొద్దు :  రాంచందర్ రావు

అభివృద్ధి ముసుగులో ..అభాగ్యుల బతుకులు ఆగం చేయొద్దు :  రాంచందర్ రావు
  •     గాంధీ సరోవర్ పేరిట 450 కుటుంబాల గెంటివేతకు యత్నం 
  •     బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: అభివృద్ధి ముసుగులో ప్రభుత్వం పేదల జీవితాలను అంధకారంలోకి నెట్టడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. పేదలపై కాంగ్రెస్  సర్కారు కొనసాగిస్తున్న దాడిని చరిత్ర ఎప్పటికీ మరిచిపోదని పేర్కొన్నారు. సోమవారం ఈ మేరకు ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు.  హైడ్రా పేరుతో వేలాది పేద కుటుంబాలను వేధింపులకు గురిచేశారని, వారి ఇండ్లను కూల్చివేశారని మండిపడ్డారు. తాజాగా గాంధీ సరోవర్  ప్రాజెక్టు పేరుతో మరో 450 పేద కుటుంబాలను రోడ్డున పడేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ప్రాజెక్టులు ఎంత ప్రతిష్టాత్మకమైనా సరే.. పేదల కన్నీళ్ల సాక్షిగా కట్టకూడదని బీజేపీ డిమాండ్  చేస్తోందన్నారు. ఎలాంటి చట్టబద్ధమైన విధానాలు పాటించకుండా, తగిన భద్రత కల్పించకుండా, కనీసం గౌరవప్రదమైన పునరావాసం చూపకుండా బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయించడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యానికే మచ్చ అని, మానవత్వానికి విరుద్ధమని విమర్శించారు. ఈ చర్యలతో నష్టపోతున్న ప్రతి కుటుంబానికి బీజేపీ అండగా నిలబడుతుందన్నారు. ప్రభావిత కుటుంబాలకు న్యాయం చేయాలని, పూర్తి పారదర్శకతతో సముచితమైన పునరావాసం కల్పించాకే ముందుకెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్  చేశారు.