V6 News

రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్ర

రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్ర

రేపు కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్‌భ‌వన్ వద్ద ధర్నా

రాజస్థాన్ లో ప్రజల చేత ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోంద‌ని పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమ‌ర్శించారు. మొన్న కర్ణాటక, నిన్న మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ కుట్రలు చేసి ప్రజాస్వామ్యాన్ని అవమాన పరిచిందని, ఇప్పుడు రాజస్థాన్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్రలు చేస్తుందని ఆయ‌న అన్నారు.

రాజస్థాన్ లో జరుగుతున్న పరిణామాలు చాలా దురదృష్టకరంగా ఉన్నాయని, బీజేపీ అధిష్టానం ఒత్తిడితోనే ఆ రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వ బలనిరూపణకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర క్యాబినెట్, అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్ర‌యత్నించినప్పటికీ గవర్నర్ అనుమతి ల‌భించ‌లేదన్నారు. దేశంలో కరోనా వ్యాధి విజృంభించి ప్రజలు నానా కష్టాలు పడుతుంటే.. బీజేపీ ఇలాంటి స‌మ‌యంలో ఒక అప్రజాస్వామిక రాజకీయం చేస్తుంద‌ని ఉత్త‌మ్ విమ‌ర్శించారు.

బీజేపీ ఒక దుర్మార్గ‌మైన‌ రాజకీయ క్రీడ ఆడుతుందని, ఆ పార్టీ చేసే కుట్రలను ప్రజాస్వామ్య పద్దతిలో దేశ వ్యాప్తంగా నిరసన తెలపాలని ఏఐసీసీ పిలుపునిచ్చిందని తెలిపారు. సోమ‌వారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్‌భ‌వన్ వద్ద ధర్నా చేప‌డుతున్న‌ట్టు… సోమ‌వారం ఉదయం 10 గంటల వరకు నాయకులంతా గాంధీభవన్ కు నాయకులంతా తరలిరావాలంటూ పిలుపునిచ్చారు. రాజ్‌భ‌వన్ ఆందోళనను విజయవంతం చేయాల‌న్నారు. తెలంగాణ కాంగ్రెస్ పక్షాన రాజస్థాన్ లో ప్రజాస్వామ్య ఖూనీని ఖండిస్తున్నట్టు చెప్పారు.

BJP was conspiring to overthrow the Congress government in Rajasthan: Uttam Kumar Reddy