గంగారాంపూర్/ మాణిక్‌చక్: బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే.. రాష్ట్ర విభజన లేకుండానే డార్జిలింగ్ కొండల్లోని గూర్ఖా ల్యాండ్ సమస్యను రాజ్యాంగబద్ధంగా పరిష్కరిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. మంగళవారం దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా గంగారాంపూర్, మాణిక్‌చక్, గజోల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.
తమ పార్టీ అధికారంలోకి రాగానే.. కొండ ప్రాంతాల్లో గూర్ఖా సోదరుల కోసం ఎకో -అడ్వెంచర్ హబ్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో రాజకీయ హింస, సిండికేట్ సంస్కృతి, కట్-మనీ రాజ్యాన్ని అంతం చేస్తామని హామీ ఇచ్చారు.
టీఎంసీ నాయకత్వం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రొటోకాల్ పాటించకుండా అవమానిస్తోందన్నారు. మమతా బెనర్జీ గూండాలను అదుపు చేయడానికి ఈసీ కేంద్ర బలగాలను మోహరించిందని చెప్పారు.

