తిరువనంతపురం: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. గురువారం (ఏప్రిల్ 9) కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో శశిథరూర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేరళలో భారీగా పోలీంగ్ నమోదు అవుతోందని తెలిపారు. భారీ పోలింగ్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి విజయానికి సంకేతంగా భావిస్తున్నానని అన్నారు. అధికారం కాదు కదా.. కేరళలో బీజేపీ కనీసం ఖాతా కూడా తెరవదని ఎద్దేవా చేశారు. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని తెలిపారు. సీఎం పినరయ్ విజయన్ తన పదేళ్ల పాలనలో కనీసం పేదలకు ఇళ్లు కూడా నిర్మించలేకపోయారని విమర్శించారు.
కేరళ అసెంబ్లీ ఎన్ని్కల్లో భారీ పోలింగ్ నమోదు అవుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు దాదాపు 35 శాతం పోలింగ్ నమోదైంది. ప్రజాస్వామ్య పండగలో భాగస్వా్మ్యం అయ్యేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్‌ల బాటపట్టారు. పోలింగ్ కేంద్రాల దగ్గర గంటల తరబడి క్యూలో నిల్చుని మరీ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటు వేస్తున్నారు.
ఎన్నికలకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సదుపాయం కల్పించినట్లు అధికారులు తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు సులభంగా ఓటు వేసేందుకు వీలుగా వలంటీర్లను నియమించినట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వీల్‌చైర్లు అందుబాటులో ఉంచామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల దగ్గర భారీగా బలగాలను మోహరించారు.
కేరళలో 2.71 కోట్ల మంది ఓటర్లు
రాష్ట్రంలోని మొత్తం 140 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలు అటు అధికార ఎల్‌డీఎఫ్ కు, ఇటు ప్రతిపక్ష యూడీఎఫ్ కు, ఉనికి కోసం పోరాడుతున్న ఎన్డీఏకు అత్యంత కీలకంగా మారాయి. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 2.71 కోట్లు మంది ఉండగా.. వీరిలో పురుషులు 1.32 కోట్లు, మహిళలు1.39 కోట్లు, ట్రాన్స్‌జెండర్లు 273 మంది, ప్రవాస ఓటర్లు 2.42 లక్షల మందికి పైగా ఉన్నారు. 883 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. 30,945 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
హ్యాట్రిక్‌పై పినరయి విజయన్ ధీమా
సీఎం పినరయి విజయన్ నాయకత్వంలోని వామపక్ష కూటమి ఈసారి హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. సాధారణంగా కేరళలో ప్రతీ ఐదేండ్లకు ప్రభుత్వం మారుతుంటుంది, కానీ గతసారి ఈ ఆనవాయితీని బ్రేక్ చేసిన విజయన్ ఈసారి కూడా తమ పదేండ్ల అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు తమను గట్టెక్కిస్తాయని ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది.
►ALSO READ | కేరళ పోలింగ్ : ఉత్సాహంగా ఓటు వేసిన మళయాళం సినిమా హీరోలు
ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, పాలనా వైఫల్యాలను ప్రధానాంశాలుగా చేసుకొని ప్రచారం నిర్వహించింది. రాహుల్, ప్రియాంక గాంధీ వంటి అగ్రనేతలు ఇక్కడ విస్తృతంగా పర్యటించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఈసారి కేరళ అసెంబ్లీలో ఖాతా తెరవడమే లక్ష్యంగా పెట్టుకుంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్‌లో సాధించిన విజయం వారికి కొండంత బలాన్నిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి నేతలు రంగంలోకి దిగి ప్రచారం చేశారు.
