V6 News

మహిళలను అవమానించడమే బీజేపీ లక్ష్యమా: గీతారెడ్డి

మహిళలను అవమానించడమే బీజేపీ లక్ష్యమా: గీతారెడ్డి

హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి గీతారెడ్డి. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని.. వాటిని ఖండిస్తున్నామన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన సీఎం తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు గీతారెడ్డి.

మహారాష్ట్రతో పాటు హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ నెలాఖరులో జరుగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ఇందులో భాగంగా  కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి మళ్లీ సోనియా గాంధీనే ఎంపిక చేశారు.. అది కూడా  చచ్చిన ఎలుకను పట్టినట్టుగా ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మనోహర్ లాల్ ఖట్టర్ . ఆ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

ఒక మహిళా నేత పట్ల బీజేపీ ఈ విదంగా మాట్లాడడం వారికి మహిళల పట్ల ఉన్న చులకన భావానికి నిదర్శనం అన్నారు గీతా రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం బీజేపీకి  ఏం అవసరమని … సోనియా గాంధీ దేశంలో ఎక్కువ కాలం ఏఐసీసీ అధ్యక్షురాలుగా పనిచేసి రెండు సార్లు కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు.