తిరుమల అలిపిరి నడక మార్గంలో తప్పిపోయిన బాలుడిని సురక్షితంగా చేరదీసి, మానవత్వాన్ని చాటుకున్నారు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది. తమిళనాడు చెంగల్‌పట్టు ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల ఆదర్శ్ అనే బాలుడు అలిపిరి మెట్ల మార్గంలో ప్రయాణిస్తుండగా.. సుమారు 2500వ మెట్టు వద్ద తన వారి నుంచి విడిపోయి తప్పిపోయాడు. ఈ సమాచారం అందిన వెంటనే టీటీడీ విజిలెన్స్ కమాండ్ కంట్రోల్ రూమ్ అప్రమత్తమైంది.
వెంటనే రంగంలోకి దిగిన ఏవీఎస్వోలు, సిబ్బందిని అప్రమత్తం చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తిరుమలలోని పీఏసీ-2 ప్రాంతంలో బాలుడు ఉన్నట్లు విజిలెన్స్,సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు.బాలుడిని సురక్షితంగా లేపాక్షి సర్కిల్‌లోని విజిలెన్స్ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఏవీఎస్వోలు వెంకట శివ కుమార్, కృష్ణయ్య సమక్షంలో ఆదర్శ్‌ను అతని బంధువులకు అప్పగించారు.
కుమారుడిని సురక్షితంగా చూసిన బంధువులు ఆనందంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.సకాలంలో స్పందించి బాలుడిని త్వరితగతిన గుర్తించిన విజిలెన్స్ సిబ్బందిని టీటీడీ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

