ఐపీఎల్ 19లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన పేలవంగా సాగుతోంది. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడి ఆ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంటుంది. ముఖ్యంగా బౌలింగ్ వైఫల్యం ఆ జట్టుకు ఇబ్బందిగా మారింది. బుమ్రా, బౌల్ట్, మిచెల్ శాంటర్న్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఉన్న ఎంఐ వరుస పరాజయాలు చవిచూస్తోంది. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్ ముంబై ఇండియన్స్ బౌలర్లు శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ముంబై ఇండియన్స్ జట్టులో ఉండేందుకు శార్ధూల్, దీపక్ అర్హులు కారని ఆయన పేర్కొన్నారు. ఆ ఇద్దరు క్రికెటర్లకు డబ్బు చెల్లించి ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచులకు దూరంగా ఉంచాలని ఎంఐ మేనేజ్మెంట్ను కోరారు. జట్టుకు మీ సేవలు అవసరమైనప్పుడు తిరిగి పిలుస్తామని నిర్మోహమాటంగా చెప్పి పంపించడని అన్నారు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఐపీఎల్ ఆడించడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు.
శారీరక, మానసిక విరామం లేకపోవడం వల్లే 5 మ్యాచుల్లో బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడని అన్నారు. ముంబై 500 పరుగులు చేసిన ప్రత్యర్థి జట్లు చేధిస్తాయని.. ఎందుకంటే ముంబై బౌలింగ్ దళం అంత దారుణంగా ఉందని విమర్శించారు. ఈ సీజన్ ప్రారంభంలో ముంబై బౌలింగ్ దళానికి తాను 9.5 రేటింగ్ ఎలా ఇచ్చానో నాకే అర్థం కావడం లేదన్నారు.
ఏప్రిల్ 16న ముంబైలోని వాంఖడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 195 పరుగులు చేయగా పంజాబ్ కింగ్స్ కేవలం 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 41 పరుగులు ఇవ్వగా, శార్దూల్, దీపక్ ఇద్దరూ కలిసి కేవలం 5.3 ఓవర్లలోనే 87 పరుగులు సమర్పించుకున్నారు. తొలి ఓవర్ వేసిన దీపక్ చాహర్ 21 రన్స్ ఇచ్చుకున్నాడు. శార్దుల్, దీపక్ ధారళంగా పరుగులు సమర్పించుకోవడంతో ముంబై ఇండియన్స్ సీజన్‌లో వరుసగా నాలుగో ఓటమి చవిచూసింది.

