V6 News

గుడ్ న్యూస్.. తెలంగాణలో బాండెడ్ లేబర్స్ కు ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి వివేక్ వెంకటస్వామి

గుడ్ న్యూస్.. తెలంగాణలో బాండెడ్ లేబర్స్ కు  ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి వివేక్ వెంకటస్వామి

బాండెడ్ లేబర్ ను అరికట్టాలంటే చట్టాలను కఠినంగా అమలు చేయాలన్నారు కార్మిక శాఖ  మంత్రి వివేక్ వెంకటస్వామి.  మానవ అక్రమ రవాణా, బాండెడ్ లేబర్ నిరోధంపై జరిగిన స్టేట్ కన్వర్జెన్స్ వర్క్‌షాప్ ముగింపు సభకు మంత్రి వివేక్ వెంకటస్వామి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా మాట్లాడిన మంత్రి వివేక్   .2021 నుండి 2025 మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 673 మంది వెట్టి చాకిరి కార్మికులను అధికారులు రక్షించారని చెప్పారు. వీరిలో పురుషులు, మహిళలతో పాటు అభం శుభం తెలియని చిన్నారులు కూడా ఉన్నారని అన్నారు. ఇటుక భట్టీలు, వ్యవసాయం, మత్స్యకార రంగం,  గృహ సేవలు వంటి రంగాల్లో అత్యంత దారుణంగా దోపిడీకి గురవుతున్న బలహీన వర్గాల ఆర్తనాదాలకు ఈ గణాంకాలు నిదర్శనమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

 చైల్డ్ లేబర్ అంశంపై స్పందిస్తూ.. బాల కార్మికులు మానసిక వేదనకు గురవుతారని, పోలీసులు ఈ కేసులను కేవలం ‘లా అండ్ ఆర్డర్’ సమస్యగా చూడకూడదని మంత్రి సూచించారు. వారిని మన ఇంటి సభ్యుల్లా భావించి, పూర్తి సానుభూతితో వ్యవహరించాలని కోరారు. 2025 జూలైలో నల్గొండ పోలీసులు కృష్ణా నది బ్యాక్‌వాటర్ ప్రాంతంలో జరిపిన మెరుపు దాడిని మంత్రి కొనియాడారు. మత్స్యకార శిబిరంలో బందీలుగా ఉన్న 29 మందిని రక్షించడంలో పోలీస్, లేబర్, రెవెన్యూ ,చైల్డ్ వెల్ఫేర్ శాఖల సమన్వయం గొప్ప ముందడుగు అని అభినందించారు.

వెట్టిచాకిరీ నుండి విముక్తి పొందిన బాధితులకు మంత్రి వివేక్ వెంకటస్వామి అండగా ఉంటామని ప్రకటించారు.బాండెడ్ లేబర్ నుండి బయటపడిన వారికి ప్రాధాన్యత క్రమంలో ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తాం. అవసరమైతే దీని కోసం ప్రత్యేక జీవో కూడా ఇస్తాం. ఎవరికైనా ఇళ్లు రాకపోతే నేరుగా నా దృష్టికి తీసుకురండి స్థానిక ఎమ్మెల్యేలతో మాట్లాడి వారికి ఇల్లు అందేలా చూస్తాం అని మంత్రి భరోసా ఇచ్చారు.

ఈ సమస్యపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం 24×7 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 8069434343 ను అందుబాటులోకి తెచ్చింది. సమాజానికి శాపంగా మారిన వెట్టిచాకిరీని తరిమికొట్టేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.