హైదరాబాద్ లో తైక్వాండో ప్రీమియర్ లీగ్ సీజన్-2 (లెగ్ వన్ మేల్) పోస్టర్‌ను మంత్రి వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని ది పార్క్ హోటల్'లో జరిగిన ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులను టీమ్ ఓనర్లను మంత్రి వివేక్ ప్రత్యేకంగా అభినందించారు. జూన్ 25 నుంచి 28 వరకు ఫిలిప్పీన్స్‌లో జరగనున్న ఈ గ్లోబల్ ఇంటర్నేషనల్ ప్రీమియర్ లీగ్ కోసం ఈ సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. తైక్వాండో అనేది ఒక కొత్త రకం క్రీడ అని, కరాటేలో ఇది ఒక భాగమని అన్నారు. ఇది కేవలం క్రీడ మాత్రమే కాదని, వ్యక్తిగత క్రమశిక్షణను నేర్పే అద్భుతమైన మార్గమని కొనియాడారు.
రాష్ట్రవ్యాప్తంగా తైక్వాండో క్రీడను ప్రోత్సహిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందిస్తూ.. ఈ క్రీడకు మరింత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేలా క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కూడా చర్చిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తైక్వాండో ప్రీమియర్ లీగ్ ఫౌండర్ డైరెక్టర్ గణేష్ దువ్వూరి, కో-ఫౌండర్ బచ్చు నవనీత ,టీమ్ సభ్యులతో పాటు, గౌరవ చైర్మన్ రౌనాక్ యార్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 19 నుంచి హైదరాబాద్‌లో ఈ లీగ్ సందడి షురూ కానుంది.

