రాష్ట్రంలోకి బ్లాక్ ఫంగస్ ఎంటర్..లక్షణాలివే..

రాష్ట్రంలోకి బ్లాక్ ఫంగస్ ఎంటర్..లక్షణాలివే..
  • రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో కేసులు నమోదు
  • లేట్‌గా గుర్తిస్తే ప్రాణాలకే ప్రమాదమంటున్న డాక్టర్లు
  • షుగర్​, ట్రాన్స్​ప్లాంటేషన్​ పేషెంట్లకు ఎక్కువ డేంజర్

హైదరాబాద్​, వెలుగు:కరోనా పేషెంట్లకు బ్లాక్‌‌ ఫంగస్ ముప్పు ముంచుకొస్తున్నది. మన దేశంలో తొలుత గుజరాత్‌‌లో కనిపించిన ఫంగస్ తర్వాత ఢిల్లీ, మహారాష్ట్రకూ పాకింది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ​ కేసులు నమోదవుతున్నాయి.  హైదరాబాద్​లోని ఓ కార్పొరేట్ ​హాస్పిటల్​లోనే ఇప్పటి వరకు 70 మంది ఈ ఇన్‌‌ఫెక్షన్ బారినపడి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. సిటీలో దాదాపు అన్ని కార్పొరేట్​ హాస్పిటళ్లలో ఇలాంటి కేసులు ఉన్నాయి. ప్రభుత్వ దవాఖానాలకు ఈ కేసుల నమోదుపై క్లారిటీ లేదు. ఒక వైపు కేసులు పెరుగుతుండడం.. మరోవైపు బ్లాక్‌‌ ఫంగస్ ట్రీట్‌‌మెంట్‌‌కు అవసరమైన మందులకు మార్కెట్‌‌లో షార్టేజ్ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం మంత్రి కేటీఆర్​ఆధ్వర్యంలో తొలిసారి సమావేశమైన కొవిడ్​ టాస్క్​ఫోర్స్​కమిటీ కూడా ఈ విషయాన్ని గుర్తించింది. ‘బ్లాక్​ ఫంగస్​ విషయంలో కూడా ప్రభుత్వం అలర్ట్‌‌గా ఉంది. అవసరమైన మందులు తెప్పిస్తున్నాం’ అని కేటీఆర్​ స్వయంగా చెప్పారు. బ్లాక్​ ఫంగస్​ట్రీట్‌‌మెంట్​కోసం పొరుగునే ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. ఈ వ్యాధి గురించి సర్కార్​ వేగంగా అలర్ట్​ కాకపోతే ఎక్కువ మంది ప్రాణాలకు ముప్పు వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.


బ్లాక్​ ఫంగస్‌‌ను సైంటిఫిక్ మ్యూకర్​ మైకోసిస్​అని పిలుస్తారు. ఇది అరుదైన వ్యాధి. సాధారణంగా వాతావరణంలో రకరకాల బ్యాక్టీరియాలు, ఫంగస్​ఉన్నట్లే ఇది కూడా ఉంటుంది. అయితే ఇమ్యూనిటీ పవర్‌‌‌‌​ బాగా తక్కువ ఉన్నవాళ్లకు అటాక్ అయ్యే చాన్స్ ఎక్కువ. సాధారణ ఆరోగ్యంతో ఉన్నవాళ్లకు ఇది ప్రమాదకరం కాదు. కరోనా పేషెంట్లలో సైటోకైన్​ స్టార్మ్‌‌ని​(ఇమ్యూనిటీ సెల్స్ ఎక్కువగా రియాక్ట్ అయ్యి మన శరీర భాగాలపైనే దాడి చేయడం) అడ్డుకునేందుకు డాక్టర్లు స్టెరాయిడ్లు ఇస్తున్నారు. ఇవి ఇమ్యూనిటీ స్పీడ్‌‌ను తగ్గిస్తాయి. కరోనా బారినపడి కండిషన్ సీరియస్‌ అయిన‌‌ పేషెంట్లకు స్టెరాయిడ్స్​ఇవ్వక తప్పడం లేదు. దీంతో ఇమ్యూనిటీ సప్రెస్‌‌ అయ్యి బ్లాక్​ఫంగస్​ అటాక్​ అవుతోంది. షుగర్ ​ఉన్న కరోనా పేషంట్లకు ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువని డాక్టర్లు చెబుతున్నారు. షుగర్​ లెవల్స్​ కంట్రోల్​ లేని వారికి, ఆర్గాన్​ ట్రాన్స్‌‌ప్లాంటేషన్​జరిగిన వారికి, క్యాన్సర్​ పేషెంట్లకు ఈ వ్యాధి సోకే ప్రమాదం మరింతగా ఉంటుందంటున్నారు.

ఇది డెత్‌‌ కాజ్ అని రాయలేం..

తెలంగాణలో ఇప్పటికే 400 పైగా ఇలాంటి కేసులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి బ్లాక్​ ఫంగస్‌ కారణంగా మరణించినా.. డాక్టర్లు కొవిడ్, పోస్ట్​కోవిడ్ ​డెత్‌‌లుగానే నమోదు చేస్తున్నారు. వారం రోజుల క్రితం హైదరాబాద్‌‌లోని ఓ కార్పొరేట్​ హాస్పిటల్‌‌లో ఒక పేషెంట్ బ్లాక్​ఫంగస్‌‌తో చనిపోతే, రికార్డుల్లో పోస్ట్​ కొవిడ్‌‌ డెత్‌‌గా చూపించారు. ట్రీట్‌‌మెంట్ సమయంలో ఒకలా చెప్పి, డెత్ సర్టిఫికెట్‌‌లో మరోలా రాయడంపై ఆ పేషెంట్ బంధువులు డాక్టర్లను ప్రశ్నించగా.. ప్రస్తుతానికి తమకు ఈ ‘కాజ్’ రాసే అధికారం లేదని చెప్పారు. గురువారం మరో కార్పొరేట్​ఆస్పత్రిలో ఇంకో డెత్​అయినట్లు ప్రచారం జరుగుతోంది.

మందుల కాస్ట్ ఎక్కువ.. షార్టేజ్ కూడా

బ్లాక్​ఫంగస్​ చాలా అరుదుగా కనిపించే వ్యాధి కాబట్టి మార్కెట్లో దాని మందుల అందుబాటు చాలా తక్కువగా ఉంది. అనూహ్యంగా కేసులు రావడం, చాలా మంది ఆలస్యంగా దాన్ని గుర్తించడంతో మెడిసిన్స్‌‌కు కొరత ఏర్పడుతోంది. బ్లాక్ ​ఫంగస్ ​వచ్చినోళ్లు ఒకరకమైన ఇంజక్షన్ ​రోజుకు4 డోసుల చొప్పన 40 డోసులు 10 రోజులు వాడాలి. దాని ఖరీదు 5 నుంచి 7 వేల వరకు ఉంది. దీంతో ఇతర మందులు కూడా వాడాలి. బ్లాక్ ​ఫంగస్ ​మందులు కొన్ని మార్కెట్‌‌లో దొరకడం లేదు. బేగంపేటలో ఉన్న ఓ కార్పొరేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒక పేషెంట్​ బంధువులను ‘లైపోజోమల్ ​ఆంఫోటెరిసిన్​-బి’ అనే ఇంజక్షన్​ని ఎక్కడి నుంచైనా తెచ్చుకోమని డాక్టర్లు సూచించారు. వాళ్లు హైదరాబాద్​ అంతా తిరిగినా అది దొరకలేదు. బ్లాక్​ఫంగల్ ​ట్రీట్‌‌మెంట్‌‌లో ఇది అత్యంత అవసరమైన ఇంజెక్షన్​ అని డాక్టర్లు చెబుతున్నారు. ఇది అందుబాటులో లేకపోవడంపైనే ఆందోళన చెందుతున్నారు. 

ఏం జాగ్రత్తలు తీసుకోవాలి

కరోనా ట్రీట్‌‌మెంట్ తీసుకుంటున్న పేషెంట్లు, రికవరీ అయిన​ వాళ్లలో బ్లాక్ ఫంగస్​ లక్షణాలు కనిపిస్తున్నాయి. ‘కరోనా తగ్గిన తర్వాత నెల రోజుల వరకు డేంజర్‌‌‌‌లో ఉన్నట్టే. ఆ టైమ్‌‌లో ఇది సోకే ప్రమాదం ఎక్కువ. హాస్పిటలైజ్​ అయిన వాళ్లే కాకుండా ఇంట్లో స్టెరాయిడ్స్​ వాడిన వాళ్లలో కూడా బ్లాక్​ ఫంగస్​వస్తోంది’ అని డాక్టర్లు చెబుతున్నారు. ఇమ్యూనిటీ తగ్గితే ఈ వ్యాధి బారినపడతారని, అందుకే కరోనా పేషెంట్లు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలోనే స్టెరాయిడ్లు వాడాలని చెప్తున్నారు. స్టెరాయిడ్ల వాడకం వల్ల షుగర్​ లెవల్స్​పెరిగే అవకాశం ఉంటుందని, షుగర్ పేషెంట్లు మరింత జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఇంట్లో ఆక్సిజన్​ తీసుకుంటున్న వాళ్లు ఆక్సిజన్​పైప్ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. కాన్సంట్రేటర్లు వాడేవాళ్లు ట్యూబ్‌‌తో పాటు అందులో వాడే నీళ్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. నాన్​కొవిడ్​ సైనస్​ పేషంట్లు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు.ముక్కు దగ్గర వాపు, ముక్కు నుంచి నల్లని పదార్థం బయటకి రావడం, రక్తం కారడం, కళ్ల వాపు, ముఖ భాగంలో ఒకవైపు నొప్పి, విపరీతమైన తలనొప్పి ఉంటే వెంటనే డాక్టర్‌‌ను కలవాలి. ముక్కు, కళ్ల ద్వారా వ్యాపించే బ్లాక్​ ఫంగస్​ దవడలు, ముక్కు లోపలి ఎముకలకు నష్టం కలిగిస్తాయి. వెంటనే అప్రమత్తం కాకపోతే మెదడుకు చేరి మనిషి బతకడం కష్టమవుతుంది.దవడలు, ముఖంలోని కొన్ని ఎముకలకు సోకితే సర్జరీ ద్వారా తొలగించాల్సి వస్తుంది. అందుకే ఈ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. 

షుగర్ ఉన్నోళ్లకు ముప్పు

పోస్ట్​ కొవిడ్​ పేషంట్లలోనే కాకుండా కరోనా ట్రీట్‌‌మెంట్ తీసుకుంటుండగా కూడా ఈ వ్యాధి వస్తోంది. కొవిడ్​డయాబెటిక్​ వాళ్లకు ఎక్కువ ప్రమాదకరం. కంటి దగ్గర నొప్పి, రెప్పల వాపు, విపరీతమైన తలనొప్పి, చూపు మందగించడం లాంటి సమస్యలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అయ్యి డాక్టర్‌‌‌‌ను కలవాలి. మా దగ్గరకు ప్రతి రోజు నాలుగైదు కేసులు వస్తున్నాయి. ఇందులో కొందరు సీరియస్ కండిషన్‌‌లో వస్తున్నారు.
- డాక్టర్ తర్జానీ వివేక్ దవే, ఎల్వీ ప్రసాద్ 
  ఐ ఇనిస్టిట్యూట్ ఆక్యులోప్లాస్టీ స్పెషలిస్ట్

నెల రోజులు అలర్ట్‌‌గా ఉండాలె

కరోనా తగ్గిన నెల దాకా బ్లాక్‌‌ ఫంగస్ ముప్పు ఉంటుంది. ఈ టైమ్‌‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెల తర్వాత ఫంగస్​ సోకే చాన్సెస్ చాలా తక్కువ. ఇమ్యూనిటీ సిస్టమ్​ దెబ్బ తినడం వల్లే ఈ ఫంగస్ ​సోకుతోంది. అందుకే ఇమ్యూనిటీ లెవల్స్​ పెంచుకోవాలి. తొందరగా గుర్తించకపోతే ప్రాణాలు కాపాడడం కష్టం. 20 ఏండ్లలో కేవలం 30 కేసులే వచ్చాయి. కానీ నెలన్నర రోజుల్లో 150 కేసులు వచ్చాయి. ఫస్ట్​వేవ్​లో 30-40 కేసులు కనిపించాయి. 
- డాక్టర్​ కె.ఆర్​.మేఘనాథ్​, 
   మా ఈఎన్టీ హాస్పిటల్​ చీఫ్​ సర్జన్​