ముంబై: దివంగత నేత అజిత్ పవార్ మరణంపై ఎన్సీపీ ఎమ్మెల్సీ అమోల్ మిత్కారి సంచలన ఆరోపణలు చేశారు. అజిత్ పవార్ మరణానికి క్షుద్ర పూజలు కారణం కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. 2025 నవంబర్‌లో అజిత్ పవార్ నివాసం సమీపంలోని భిగ్వాన్ రోడ్డు సహ్యోగ్ సొసైటీ ప్రాంతంలో క్షుద్ర పూజలు జరగడమే ఇందుకు ప్రధాన కారణమని అన్నారు.
లైంగిక వేధింపుల కేసులో ఇటీవల అరెస్ట్ అయిన అశోక్ ఖరత్ అలియాస్ భోండు బాబా నడుపుతున్న శివలికా ఆశ్రమంతో ఈ క్షుద్ర పూజలకు సంబంధం ఉందని ఆరోపించారు. అశోక్ ఖరత్ భక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం ఈ క్షుద్ర పూజలు చేసి ఉండొచ్చన్నారు.
అజిత్ పవార్ మరణానికి గురైన రోజు వీఎస్ఆర్ సంస్థకు చెందిన హెలికాప్టర్లో ప్రయాణించమని బాబా భక్తుల్లో ఎవరైనా దాదాకు సలహా ఇచ్చి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. 2025, నవంబర్ 16 నుంచి 2026, జనవరి 31 మధ్య ఖరత్, అతని ఆశ్రమ పూజారుల కాల్ డిటైల్ రికార్డులను పరిశీలిస్తే అసలు నిజం బయటపడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ అజిత్ పవార్ ఇటువంటి మూఢ నమ్మకాలను అస్సలు నమ్మే వారుకాదని అన్నాడు.
ఎమ్మెల్సీ అమోల్ మిత్కారి చేసిన సంచలన ఆరోపణలపై ఎన్‌సీపీ (ఎస్‌పీ) నాయకుడు, అజిత్ పవార్ మేనల్లుడు రోహిత్ పవార్ స్పందించారు. మహారాష్ట్ర వంటి ప్రగతిశీల రాష్ట్రంలో మూఢనమ్మకాలకు, ఇలాంటి మోసపూరిత పద్ధతులకు తావు లేదన్నారు. కానీ ఈ విషయంలో కొన్ని విషయాలు నమ్మే విధంగా ఉన్నాయని.. అమోల్ మిత్కారి ఆరోపించిన క్షుద్రపూజల ఘటనలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
కాగా, 2026, జనవరి 28న అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా బారామతి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తోన్న విమానం కుప్పకూలడంతో దాదా దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు వ్యక్తిగత సిబ్బంది మరణించారు.
