సర్పై అప్రమత్తంగా ఉండకపోతే ..లీడర్ల జీవితాలు తలకిందులు..బీఎల్వోలకు అవగాహన సదస్సు

సర్పై అప్రమత్తంగా ఉండకపోతే ..లీడర్ల జీవితాలు తలకిందులు..బీఎల్వోలకు అవగాహన సదస్సు
  •     మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్, వెలుగు: ఓట్ల సవరణలో బీఎల్​ఏలు, బీఎల్​వోలు అప్రమత్తంగా ఉండకపోతే రాజకీయ నాయకుల జీవితాలు తలకిందులయ్యే పరిస్థితి వస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఖమ్మంలోని తన క్యాంపు ఆఫీస్​లో సర్​పై బీఎల్​లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 2002 తర్వాత 24 ఏళ్లకు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక సవరణ చేపట్టిందన్నారు. 

2002 ఓటర్ జాబితాను ఆధారంగా తీసుకుని 2026 జాబితాతో పోల్చి సవరణ చేస్తున్నట్లు తెలిపారు. మృతి చెందినవారు, ఇతర ప్రాంతాలకు మారినవారు, డబుల్ ఓటు కలిగిన వారి పేర్లను తొలగించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఖమ్మం నియోజకవర్గంలోని 3.28 లక్షల ఓట్లలో సగం కూడా మ్యాపింగ్ కాలేదని, ఇప్పటికీ సుమారు లక్షన్నర ఓట్లు గుర్తించాల్సి ఉందన్నారు. 

ఎన్నికల్లో గెలవాలంటే అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండాలని, డూప్లికేట్ ఓట్లు తొలగినా అసలు ఓట్లు తొలగిపోకుండా బీఎల్​ఏలు జాగ్రత్తపడాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తన గిడ్డంగుల సంస్థ చైర్మన్​ రాయల నాగేశ్వరరావు  తదితరులు పాల్గొన్నారు.