మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ఫాల్తా రీ-పోలింగ్ నుంచి తప్పుకున్న TMC అభ్యర్థి జహంగీర్ ఖాన్

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ఫాల్తా రీ-పోలింగ్ నుంచి తప్పుకున్న TMC అభ్యర్థి జహంగీర్ ఖాన్

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పోలింగ్‌కు ముందే ఊహించని భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని ప్రతిష్టాత్మక ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి జరగబోయే రీపోలింగ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మాజీ సీఎం మమతా బెనర్జీ నమ్మినబంటు, టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ మంగళవారం నామినేషన్ ఉపసంహరించుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ అనూహ్య పరిణామం దీదీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు రాజకీయ ఎదురుదెబ్బగా మారింది. 

నామినేషన్ వెనక్కి తీసుకున్న అనంతరం జహంగీర్ ఖాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. తానేమీ ఒత్తిడితో తలవంచలేదని, తన సొంత నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. తాను ఫాల్తా మట్టి బిడ్డనని.. అక్కడ ఎప్పుడూ శాంతిభద్రతలు వర్ధిల్లాలి, ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సీఎం సువేందు అధికారి ఫాల్తా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారని, అందుకే తాను ఈ రీ-పోల్ రేసు నుంచి తగ్గాలని నిర్ణయించుకున్నట్లు ఖాన్ ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజేసింది.

టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి అత్యంత పట్టున్న డయామండ్ హార్బర్ లోక్‌సభ పరిధిలోకి వచ్చే ఫాల్తా నియోజకవర్గంలో ఈ పరిణామం జరగడం గమనార్హం. ఇక్కడ జహంగీర్ ఖాన్ తప్పుకోవడంతో.. ఇక ప్రధాన పోటీ BJP అభ్యర్థి దేబాంగ్షు పాండా, కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుర్ రజాక్ మొల్లా, అలాగే సీపీఐ అభ్యర్థి శంభు నాథ్ కుర్మిల మధ్యే ఉండనుంది. మే 21న మొత్తం 285 బూత్‌లలో రీ-పోలింగ్. గత ఏప్రిల్ 29న జరిగిన 2వ విడత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫాల్తా నియోజకవర్గం తీవ్ర హింసాకాండకు, అక్రమాలకు కేంద్రబిందువుగా మారింది. డెబీపూర్ వద్ద ఈవీఎంలపై ఉన్న బీజేపీ గుర్తుపై తెల్లటి టేప్ వేసి ఓటర్లను ఓటు వేయకుండా అడ్డుకున్నారని బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పాండాతో పాటు ఓటర్లు పెద్ద ఎత్తున ఆరోపించారు.

 ఎన్నికల్లో జరిగిన అక్రమాలు, ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేయడం వంటి ఫిర్యాదులను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఫాల్తా నియోజకవర్గంలోని మొత్తం 285 పోలింగ్ బూత్‌లలో ఎన్నికలను రద్దు చేసి.. మే 21న రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది.  ఈ రీ-పోలింగ్ మే 21న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ జరగనుంది. ప్రజలు ఎటువంటి భయం లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా పారామిలటరీ బలగాలను మోహరిస్తున్నారు. వీటి లెక్కింపు మే 24న చేపట్టనున్నారు. పోలింగ్ ముందే అభ్యర్థి తప్పుకోవడంతో ఈ స్థానంలో అధికార బీజేపీ జెండా ఎగరడం ఖాయమని తెలుస్తోంది.