మలయాళ క్రైం థ్రిల్లర్ను మించి.. తల్లిని, తోడబుట్టినోడిని చంపేసి ఇంటి కాంపౌండ్లో పాతిపెట్టాడు.. ఎలా బయటపడిందంటే..

మలయాళ క్రైం థ్రిల్లర్ను మించి.. తల్లిని, తోడబుట్టినోడిని చంపేసి ఇంటి కాంపౌండ్లో పాతిపెట్టాడు.. ఎలా బయటపడిందంటే..

ఇడుక్కి: కేరళంలోని ఇడుక్కి జిల్లాలో అమానుష ఘటన జరిగింది. కన్న తల్లిని, సోదరుడిని హత్య చేసి, వారి మృతదేహాలను ఇంటి ఆవరణలో పాతిపెట్టిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో 45 ఏళ్ల సాజీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కుటుంబ డైలీ రొటీన్ ఎప్పటి లాగా లేకపోవడంతో ఈ కుటుంబంతో సంబంధం ఉన్న ఒక ఆటో డ్రైవర్కు అనుమానమొచ్చింది.

ఆటో డ్రైవర్ ఆ ఇంటి పెద్ద కనిపించకపోవడంతో.. మీ అమ్మ కనిపించడం లేదని ఆమె కూతురికి సమాచారం ఇచ్చాడు. అప్పుడు ఆ కూతురు ఇంటికి వెళ్లి చూడగా అసలు విషయం బయటికొచ్చింది. ఒకే రాత్రిలో ఈ రెండు హత్యలు జరిగాయి. నిందితుడు సాజి.. తన సోదరుడు రేజిని కొట్టి, ఆపై గొంతు నులిమి చంపినట్లు తెలిసింది. రేజి మద్యం సేవించి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత.. అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ కారణంగా మాటామాటా పెరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

ఈ క్రమంలోనే క్షణికావేశంలో సాజి తన సోదరుడు రేజిపై దాడి చేశాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రేజి స్పృహ కోల్పోయాడు. సాజి అతనిని ఆ తర్వాత గొంతు నులిమి చంపేశాడు. ఈ గొడవను చూసిన కన్న తల్లి మేరీ కుట్టిని కూడా నిందితుడు చంపేశాడని పోలీసులు తెలిపారు. సాజి ఆమెను ఊపిరాడకుండా చేసి చంపే ముందు, ఆమె ముఖంపై పదేపదే కొట్టినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిందితుడు మృతదేహాలను ఇంటి లోపల పాతిపెట్టడానికి ముందు రెండు రోజుల పాటు ఇంట్లోనే దాచేశాడు. రెండు రోజుల తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా రాత్రి సమయంలో ఇంటి ఆవరణలో గొయ్యి తవ్వి రెండు మృతదేహాలను పాతేశాడు. సాజి ఒక్కడే ఇదంతా చేశాడు. ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఆస్తి గొడవల కారణంగానే ఈ హత్యలు జరిగాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ కుటుంబానికి చెందిన ఒక ఎకరం ల్యాండ్ విషయంలో అన్నదమ్ముల ఇద్దరి మధ్య గొడవ జరిగిందని పోలీసులు చెప్పారు. ఈ ల్యాండ్ సొంతం చేసుకుని సాజి పెళ్లి చేసుకుందామని భావించాడని విచారణలో తెలిసింది. అయితే.. ఈ ప్లాన్స్ రేజి కారణంగా ఫెయిల్ కావడంతో సాజి అతనిపై పగ పెంచుకున్నాడు. మేరీకుట్టికి అనారోగ్య సమస్యలు ఉండటంతో ఆమె రోజూ హాస్పిటల్కు వెళ్లి వస్తుండేది. ఆమెను ఆటో డ్రైవర్ రోజూ తీసుకెళ్లి తీసుకొస్తుండేవాడు.

ఈ ఆటో డ్రైవర్కు వచ్చిన అనుమానం కారణంగానే ఈ మిస్సింగ్ మిస్టరీ సాల్వ్ అయింది. ఈ టోటల్ ఎపిసోడ్లో మరో ట్విస్ట్ ఏంటంటే.. గ్రామస్తులు మేరీకుట్టిని కేరళ ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 9న పోలింగ్ బూత్ దగ్గర చివరిగా చూశారు. ఆ తర్వాత ఆమె గ్రామస్తులకు కనిపించలేదు. రేజి కూడా కనిపించలేదు. కేరళ ఎన్నికలు జరిగిన రెండు మూడు రోజులకే సాజి ఈ ఇద్దరినీ చంపేసి పాతి పెట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. 2018లో మేరీకుట్టి భర్త మ్యాథ్యూ కనిపించకుండా పోయాడు. మ్యాథ్యూ కనిపించకుండా పోవడం వెనుక సాజి పాత్ర ఉందేమోననే కోణంలో పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.