- దొంగ పట్టాలతో పలువురి ఉద్యోగాలు
- తాజాగా ఫోర్జరీ చేసి ఉద్యోగం పొందిన మహిళా ఏఈఓ
- గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు
- ఇప్పటి వరకు పలువురు నకిలీ ఆఫీసర్లపై వేటు
- ఎంక్వైరీ షురూ కాగానే కొందరు స్వచ్ఛందంగా పదవీ వివరమణ
- బోగస్ అధికారులను ఏరివేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యవసాయ శాఖలో బోగస్ అగ్రికల్చర్ డిగ్రీలు, డిప్లొమాలతో ఉద్యోగాలు పొందిన వారి వ్యవహారం మళ్లీ సంచలనం సృష్టిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2005 నుంచి దొంగ సర్టిఫికెట్లతో ఏఈఓ (అసిస్టెంట్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్)లు, ఏఓలు, ఏడీఏ, జేడీఏ స్థాయి అధికారులుగా పనిచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అగ్రికల్చర్ డిప్లొమా చదవకుండానే ఫోర్జరీ చేసిన దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొంది దర్జాగా కొనసాగుతున్నారు.
గత ప్రభుత్వ హయంలో జరిగిన అక్రమాలతో ఇప్పటికే దొంగ పట్టాలతో పలువురు ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తోంది. తవ్విన కొద్దీ బోగస్ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగులోకి వస్తున్నది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏఈఓలుగా పనిచేస్తూనే అగ్రికల్చర్ డిగ్రీ ఇన్ సర్వీస్ కోటాలో చదువుతూ పేపర్ లీకులకు పాల్పడి 30 మంది ఉద్యోగులు సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే.
నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో కొనసాగుతున్నరు..
గతంలో జరిగిన రిక్రూట్‌మెంట్ లో అంబేద్కర్ యూనివర్సిటీ (ఆగ్రా, ఉత్తరప్రదేశ్) నుంచి దాదాపు 30 మంది అగ్రికల్చర్ బీఎస్సీ చేసినట్లు పలువురు అభ్యర్థులు సర్టిఫికెట్లు చూపించారు. అయితే ఇవన్నీ నకిలీవని, ఐసీఏఆర్ గుర్తింపులేని యూనివర్సిటీల నుంచి కొనుగోలు చేసిన సర్టిఫికెట్లని ఆరోపణలు వచ్చాయి. కొందరి సర్టిఫికెట్లలో దేశంలో ఎక్కడాలేని సాయిల్ సైకాలజీ వంటి సబ్జెక్టులు, ఒకే ఇయర్‌లో చదివినా రిజిస్ట్రార్, వీసీ సంతకాలు వేరువేరుగా ఉండటం వంటివి బయటపడ్డాయి. ఇలా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో దాదాపు 150 మందికి పైగా చేరినట్లు తెలుస్తోంది.
తాజాగా జగిత్యాల జిల్లాలో ఓ మహిళా ఏఈఓ, ఏపీకి చెందిన వ్యక్తి అగ్రికల్చర్ డిప్లొమా పట్టాను ఫోర్జరీ చేసి ఉద్యోగం పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో నిజామాబాద్ జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లతో ముగ్గురు ఏఓలు సస్పెండ్ అయ్యారు, మరికొందరు ఇతర జిల్లాల్లో కొనసాగుతున్నా ఎంక్వైరీ పూర్తికాకపోవడంతో చర్యలు తీసుకోలేదు. దాంతో వారు ఇంకా ఉద్యోగాల్లో కొనసాగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ విభాగంలోనూ ఇలాంటి నకిలీ అధికారులు ఉండడంతో ఇన్నాళ్లు దర్యాప్తు ముందుకు సాగలేదనే విమర్శలు ఉన్నాయి.
ఈ అపవాదును తొలగించుకునే క్రమంలో అగ్రికల్చర్ విజిలెన్స్ వింగ్ టీమ్‌లో ఉన్న ఓ అక్రమార్కుడిని సొంత డిపార్ట్‌మెంట్‌కు పంపించగా ఈ వ్యవహారం బయటపడుతుందని స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అక్రమాలపై అగ్రికల్చర్ విద్యార్థి, యువజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అగ్రికల్చర్ సెక్రటరీ, కమిషనర్, డైరెక్టర్ కార్యాలయాలకు వినతిపత్రాలు అందజేసి, పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అక్రమార్కులను వెంటనే తొలగించాలి
రాష్ట్రంలో గత కొంతకాలంగా వ్యవసాయ శాఖలో బోగస్ డిగ్రీ పట్టాలతో కొంతమంది ఉద్యోగాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందనరావుకు రిప్రజెంటేషన్ ఇచ్చి, సాక్ష్యాలు సమర్పించాం. పత్రికల్లో కథనాలు వచ్చినా ఎంక్వైరీ కమిటీ మధ్యలోనే ఆగిపోయింది. తాజాగా అగ్రికల్చర్ సెక్రటరీ సురేంద్ర మోహన్‌కి ఫిర్యాదు చేశాం.
అగ్రికల్చర్ డైరెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించాం. ప్రస్తుత ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కావడంతో పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం.
- రమావత్ హరిప్రసాద్, అగ్రికల్చర్ స్టూడెంట్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, యువజన కాంగ్రెస్
