- ఒకే అడ్రస్పై పదుల సంఖ్యలో నమోదు
- ఓటర్ల పేర్లు ఇంటి ఓనర్లకే తెలియవు
- ఓట్లన్నీ ఓ ప్రైవేట్ వర్సిటీ స్టాఫ్ ఇండ్ల అడ్రస్పైనే
- బీఎల్వో రిజెక్ట్ చేసినా లిస్టులో పేర్లు ప్రత్యక్షం
హైదరాబాద్, వెలుగు: వరంగల్ – ఖమ్మం – నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానంలో బోగస్ ఓట్లు వెలుగు చూస్తున్నాయి. ప్రతిపక్షాలు ఆరోపించినట్లు దొంగ ఓట్లు బయటకు వస్తున్నాయి. ఒకే ఇంటి అడ్రస్పై పదుల సంఖ్యలో గ్రాడ్యుయేట్స్ ఓట్లు కనిపిస్తున్నాయి. ఇంత మంది ఓటర్లు తమ ఇంట్లో ఏడున్నరని ఇంటి ఓనర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఓ ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన స్టాఫ్ ఇండ్లల్లోనే ఇవన్నీ ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఆ యూనివర్సిటీ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందినదిగా ఆరోపణలు వస్తున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో వరంగల్ – ఖమ్మం–నల్లగొండ, హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే ఓటర్ల జాబితాను పబ్లిష్ చేశారు. అయితే ఉద్యోగాల భర్తీలో ఫెయిల్యూర్, నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం, పీఆర్సీ ప్రకటించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆయా వర్గాలు గుర్రుగా ఉన్నాయి. దీంతో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో బోగస్ ఓట్లకు తెరలేపారని, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు చెందని వ్యక్తులతో ఓట్లు నమోదు చేశారని ప్రతిపక్షాలు మొదటి నుంచీ ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో ఓటరు లిస్టులో ఒకే అడ్రస్పై పదుల సంఖ్యలో ఓట్లు బయట పడుతుండటం ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.
ఒకే ఇంటి అడ్రస్పై పదుల సంఖ్యలో ఓట్లు ఉన్న ఇండ్లన్నీ ఓ ప్రైవేట్ యూనివర్సిటీ స్టాఫ్కు చెందినవే అని తెలుస్తోంది. సదరు ఇండ్లకు వెళ్లి పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ‘‘మీ ఇంటి పేరు మీద ఐదారు ఓట్లు ఉన్నాయి. ఇందులో ఎవరన్నా మీకు తెలుసా..?” అని సదరు ఇంటికి వెళ్లి అడిగితే.. ‘‘వాళ్లలో ఒకరు తప్ప మిగతా వారు ఎవరో మాకు తెలియదు. ఎప్పుడు ఆ పేర్లు వినలేదు. వారితో మాకు సంబంధమే లేదు” అని ఇంటోళ్లు చెప్తున్నారు. ఆ ఒకరు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారని వారు చెప్పడం విశేషం. ఇట్ల చాలా గ్రామాల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇదే విషయమై సోమవారం వరంగల్-– నల్లగొండ–ఖమ్మం-- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బీఎల్వో రిజెక్ట్ చేసినా లిస్ట్లో పేరు
ఆన్లైన్లో ఓటరుగా నమోదు చేసుకుంటే వివిధ దశల్లో అధికారులు పరిశీలించి ఓటరుగా ధ్రువీకరిస్తారు. ఓటరుగా నమోదు చేసుకున్న తర్వాత సదరు వ్యక్తి అడ్రస్ కరెక్టేనా..? స్థానికంగా ఉంటున్నాడా..? డిగ్రీ పట్టా నిజమేనా..? అనే తదితర అంశాలను బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్వో) పరిశీలిస్తారు. ఇంటికొచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాతే ఓటు ఫైనల్ చేస్తారు. అయితే ఓటరు డీటైల్స్ సరిగా లేకుంటే అప్లికేషన్ను రిజెక్ట్ చేసి ఎన్నికల అధికారులకు పంపిస్తారు. వాళ్లే ఫైనల్ నిర్ణయం తీసుకోవాలి. కానీ వరంగల్–నల్గొండ–ఖమ్మం నియోజకవర్గ పరిధిలో అనేక చోట్ల బీఎల్వోలు అప్లికేషన్లను రిజెక్ట్ చేసినా.. లిస్ట్లో మాత్రం ఆ వ్యక్తుల ఓట్లు కనిపిస్తున్నాయి. చౌటుప్పల్ మండలంలోని స్వాములవారి లింగోటంలో అపర్ణప్రియ అనే మహిళ ఓటుకు అప్లయ్ చేసుకుంది. కానీ అపర్ణప్రియ వివరాలను గ్రామంలో బీఎల్వో రఫీక్ ఎంక్వైరీ చేసి సదరు మహిళ గ్రామంలో లేదని ఓటు రిజెక్ట్ చేశారు. ఫైనల్ ఓటరు లిస్ట్లో మాత్రం అపర్ణప్రియ ఓటు కనిపించింది. ఇలా అనేక మంది ఓట్లు రిజెక్ట్ చేసినా.. ఓటరు లిస్ట్లో ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఒకే అడ్రస్పై ఐదుగురు
‘‘హౌస్ నంబర్ -6-–103, జనగాం..’’
ఇది జనగాంలోని ఓ ఇంటి నంబర్. ఈ ఇంటి పేరు మీద ఏకంగా ఐదు గ్రాడ్యుయేట్స్ ఓట్లు ఉన్నాయి. 1) డాక్టర్ ఎల్. వేణగోపాల్, 2) పి. చైతన్య కృష్ణ, 3) పి. సరిత, 4) డాక్టర్ షేక్ షఫీ, 5) శ్రవణ్ కుమార్.
మరో చోట ఇదే పరిస్థితి
‘‘హౌస్ నంబర్ 1–3–173 , విద్యానగర్ , భువనగిరి– 508166’’
ఇదీ భువనగిరి టౌన్లోని మరో అడ్రస్. ఈ ఇంటి చిరునామాపై కూడా ఐదుగురికి ఓట్లు ఉన్నాయి. 1) టి. ఆశాలత, 2) డి. పద్మజ, 3) నితీషా శర్మ, 4) ఎన్. నాగలక్ష్మి, 5) వి. లలిత లావణ్య.
అనురాగ్ యూనివర్సిటీ కేంద్రంగా బోగస్ ఓట్లు
అధికారాన్ని అడ్డం పెట్టుకుని పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారు. అనురాగ్ యూనివర్సిటీ కేంద్రంగా బోగస్ ఓట్లు సృష్టించారు. మా టీంలను పంపించి, పరిశీలించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నం. అనురాగ్ యూనివర్సిటీకి చెందిన స్టాఫ్ ఇదంతా చేశారు. వేరే ప్రాంతాల వ్యక్తులను తీసుకొచ్చి ఎన్రోల్ చేయించారు. ఒక్క రోజే 250కిపైగా బోగస్ ఓట్లను పట్టుకున్నం. ఇలా వేల ఓట్లను గుర్తించినం. అక్రమాలు జరుగుతున్నాయని గతంలో చెప్పినం. బీఎల్వో రిజెక్ట్ చేసినా ఓటరు లిస్ట్లో పేర్లున్నయి. దీనికి ఎవరు బాధ్యులు?
- తీన్మార్ మల్లన్న, ఇండిపెండెంట్ అభ్యర్థి
