
- నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
- అతనిపై పలు బైక్ దొంగతనాల కేసులు కూడా
మెహిదీపట్నం, వెలుగు : ప్రజా భవన్, నాంపల్లి కోర్టులో బాంబు పెట్టారని కాల్ చేసి బెదిరించిన వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, నాంపల్లి పోలీసులు సంయుక్తంగా అతడిని పట్టుకొని రిమాండ్ కు తరలించారు. ఇన్స్ పెక్టర్ అభిలాష్.. మీడియాకు వివరాలు వెల్లడించారు. మంగళవారం 100కు డయల్ చేసి ప్రజాభవన్ తో పాటు నాంపల్లి క్రిమినల్ కోర్టులో బాంబులు ఉన్నాయని చెప్పాడు. మరికొంత సేపట్లో అవి పేలుతున్నాయని తెలపడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రజా భవన్ తో పాటు నాంపల్లి క్రిమినల్ కోర్టులో సోదాలు నిర్వహించి, బాంబులు లేవని నిర్ధారించాయి. అతడు ఫేక్ కాల్ చేసినట్లు గుర్తించారు.
అతను ఫోన్ చేసిన నంబర్ ఆధారంగా ట్రేస్ చేసి అరెస్టు చేశారు. అతడిని మల్కాజిగిరిలోని మౌలాలి భరత్ నగర్ ప్రాంతానికి చెందిన శివకుమార్ (40) గా గుర్తించారు. వృత్తిరీత్యా అతను లేబర్. కాగా, హైదరాబాద్ లోని 2017, 2018, 2023లో వివిధ పోలీస్ స్టేషన్ తో పాటు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 10 బైకు దొంగతనాల కేసులు అతనిపై ఉన్నాయి. దీంతో పోలీసులు నిత్యం తనను వేధిస్తున్నారని, అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాల క్రితం భార్య కూడా వేధించిందని అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో భార్య.. కూతురిని తీసుకుని పుట్టింటికి వెళ్లింది. దీంతో అతను మానసికంగా ఆందోళన చెందాడు. ఈ క్రమంలో పోలీసులకు ఫోన్ చేసి ప్రజాభవన్, నాంపల్లి క్రిమినల్ కోర్టులో బాంబు ఉందని చెప్పాడు.