V6 News

బాంబే హైకోర్టు సంచలనం : 90 ఏండ్ల వృద్ధురాలి కేసు.. 20 ఏండ్లకు వాయిదా

బాంబే హైకోర్టు సంచలనం : 90 ఏండ్ల వృద్ధురాలి కేసు.. 20 ఏండ్లకు వాయిదా
  •     పరువు నష్టం కేసులో బాంబే హైకోర్టు సంచలన ఆదేశాలు
  •     ఫిర్యాదుదారు విజ్ఞప్తితో మరుసటి రోజే 
  •      ఉత్తర్వులు సవరించిన జడ్జి

ముంబై: న్యాయవ్యవస్థలోనే ఓ అరుదైన, ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. ఒక పరువు నష్టం దావాను ఏకంగా 20 ఏండ్ల తర్వాత విచారిస్తామంటూ ఇచ్చిన సంచలన ఉత్తర్వులను ముంబై హైకోర్టు బుధవారం సవరించింది. 2046వ సంవత్సరానికి వాయిదా వేసిన ఆ కేసును.. తిరిగి ఈ ఏడాది జులై 15న విచారించాలని నిర్ణయించింది.

90 ఏండ్ల తరిణిబెన్ దేశాయ్ అనే వృద్ధురాలు.. కిల్‌‌‌‌కిల్‌‌‌‌రాజ్ భన్సాలీ అనే మరో సీనియర్ సిటిజన్‌‌‌‌పై 2017లో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు గత మంగళవారం జస్టిస్ జితేంద్ర జైన్ ధర్మాసనం ముందుకు వచ్చింది. ఇరు పక్షాలు రాజీకి యత్నించాలని  కోర్టు సూచించింది.

 
ప్రతివాదులు క్షమాపణ చెప్పడానికి అంగీకరించినప్పటికీ.. ఆ 90 ఏండ్ల వృద్ధురాలు పట్టువదల్లేదు. దీంతో కేసు మళ్లీ మొదటికి వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జీవిత చరమాంకంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇలా ఈగో ఫైట్‌‌‌‌ చేస్తూ కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ కేసును 2046కి వాయిదా వేశారు. కాగా, ఫిర్యాదుదారు తరపు న్యాయవాది స్వరాజ్ జాదవ్ బుధవారం కోర్టులో మరోసారి విజ్ఞప్తి చేశారు. దీంతో సానుకూలంగా స్పందించిన జస్టిస్ జితేంద్ర జైన్.. ఈ కేసును 2026 జులై 15న తదుపరి పరిశీలన కోసం లిస్ట్ చేయండని కోర్టు రిజిస్ట్రీకి సూచించారు.