లిబియా మిలిటరీ అకాడమీపై బాంబింగ్…30 మంది మృతి

లిబియా మిలిటరీ అకాడమీపై బాంబింగ్…30 మంది మృతి

మరో 33 మందికి తీవ్ర గాయాలు

ఎల్ఎన్ఏ పనేనని ప్రభుత్వం ఆరోపణ

లిబియా రాజధాని ట్రిపోలీలోని మిలిటరీ అకాడమీపై శనివారం అర్ధరాత్రి దాటాక వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో కనీసం 30 మంది చనిపోగా, మరో 33 మందికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు చెప్పారు. మృతుల్లో చాలామంది ట్రైనింగ్​ తీసుకుంటున్న సోల్జర్లేనని వివరించారు. గ్రౌండ్​లో పరేడ్​ పూర్తిచేసుకుని వాళ్లంతా తమ టెంట్లలోకి వెళుతుండగా దాడి జరగిందని చెప్పారు. గాయపడ్డ సైనికులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి ట్రీట్​మెంట్​ ఇప్పిస్తున్నట్లు సైనిక ఉన్నతాధికారులు చెప్పారు. ట్రిపోలీలో ప్రభుత్వానికి, సెల్ఫ్​స్టైల్డ్​ లిబియన్​ నేషనల్​ ఆర్మీ(ఎల్ఎన్ఏ) మధ్య కొంతకాలంగా వార్​ నడుస్తోంది. రాజధానిని స్వాధీనం చేసుకోవాలని జనరల్​ఖాలీఫా హిఫ్తార్​నేతృత్వంలోని ఎల్ఎన్​ఏ దాడులకు పాల్పడుతోంది. యూఎన్​ మద్దతుతో ప్రభుత్వం ఈ దాడులను ఎదుర్కొంటోంది. ఇటీవల కాలంలో ఈ పోరు మరింత తీవ్రంగా మారింది. ట్రిపోలీని దక్కించుకోవడం కోసం తుదిపోరాటం చేస్తామంటూ జనరల్​ ఖాలీఫా హిఫ్తార్​ ఇటీవల ప్రకటించారు. మరోవైపు ఎల్ఎన్ఏ పై పోరును ఉధృతం చేయడానికి ప్రభుత్వం టర్కీ మద్దతు కోరింది. ఈమేరకు మారిటైమ్​ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలోనే  మిలిటరీ అకాడమీపై దాడి జరిగింది. దాడి వెనక ఎల్ఎన్​ఏ హస్తం ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, దీనిపై స్పందించేందుకు ఎల్ఎన్ఏ అధికార ప్రతినిధి నిరాకరించారు.