వణికిస్తున్న చలి.. మరో మూడ్రోజులు మరింత తీవ్రం

వణికిస్తున్న చలి.. మరో మూడ్రోజులు మరింత తీవ్రం
  • రాష్ట్రంలో పడిపోతున్న రాత్రి టెంపరేచర్లు 
  • సంగారెడ్డిలోని కోహీర్ లో 7.1 డిగ్రీల టెంపరేచర్  
  • దట్టంగా కురుస్తున్న పొగ మంచు 

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రాన్ని చలి గజగజ వణికిస్తోంది. వారం నుంచి వణుకుడు మరీ ఎక్కువైంది. పగలు, రాత్రి చలి గాలులు వీస్తున్నాయి. రాత్రి టెంపరేచర్లు భారీగా పడిపోతున్నాయి. సాధారణం కంటే రెండుమూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు సంగారెడ్డి జిల్లాలోని కోహీర్‌‌లో 7.1 డిగ్రీల మినిమమ్ టెంపరేచర్ రికార్డయింది. వికారాబాద్‌‌లోని మార్పల్లి, సంగారెడ్డిలోని అల్‌‌గోల్‌‌లో 8.1, రంగారెడ్డిలోని రెడ్డిపల్లి, కసులాబాద్‌‌లో 8.5, హైదరాబాద్‌‌లోని రాజేంద్రనగర్‌‌లో 9.9  డిగ్రీల చొప్పున నమోదైంది. 

మరో మూడ్రోజులూ రాత్రి టెంపరేచర్లు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో చలి ఎక్కువగా ఉంటుందని చెప్పింది. సాయంత్రం 6 గంటలకే మొదలవుతున్న చలి.. ఉదయం 9 గంటలైనా తగ్గడం లేదు. మరోవైపు పొగ మంచు దట్టంగా కురుస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటోంది. దీంతో బండ్లపై వెళ్లేటోళ్లకు రోడ్డు కనిపించడం లేదు. మబ్బుల్నే పోయే పాలు, కూరగాయల రైతులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, చలితో సీజనల్‌‌‌‌‌‌‌‌ వ్యాపారం ఊపందుకుంది. రగ్గులు, స్వెటర్లు, మఫ్లర్లకు గిరాకీ పెరిగింది. 
రోగాలతో పైలం... 
చలి తీవ్రత వల్ల రోగాలు వ్యాపించే చాన్స్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. డెంగీ, స్వైన్‌‌‌‌‌‌‌‌ఫ్లూ, ఆస్తమా, చర్మ  వ్యాధులు, న్యుమోనియా వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆస్తమా బాధితులు దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలని.. చల్లటి గాలికి ఎక్కువగా తిరగొద్దని సూచిస్తున్నారు. జర్నీ చేసేటప్పుడు నోరు, ముక్కు కవర్‌‌‌‌‌‌‌‌ అయ్యేలా మాస్కులు, స్వెటర్లు వాడాలని చెబుతున్నారు. గుండె జబ్బులు ఉన్నోళ్లు, గుండె ఆపరేషన్ చేయించుకున్నోళ్లు చలిలో ఎక్కువగా తిరిగితే రక్తనాళాలు సంకోచించి సమస్యలు వస్తాయంటున్నారు.