ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్‌ఆర్) వరకు విస్తరించిన హైదరాబాద్ మహా నగరంలో పలు ప్రాంతాల్లో అనూహ్యంగా బోర్లు ఎండిపోతున్నాయి. నగరంలో రోజుకు 300 నుంచి 500 బోర్లు ఎత్తిపోతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం మెట్రో వాటర్ బోర్డు అధికారులు చేసిన అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా వెస్ట్ సిటీతోపాటు ఉప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్‌లాంటి ప్రాంతాల్లో బోరుబావులు చాలా త్వరగా ఎండిపోతున్నట్టు అధికారులు తెలిపారు.
గ్రేటర్ పరిధిలో ముఖ్యంగా ఔటర్ రింగ్‌రోడ్ వెంట భారీ ఎత్తున హైరైజ్ భవనాలు వెలుస్తున్నాయి. కోకాపేట, నార్సింగి, వట్టి నాగులపల్లి, గండిపేట, కొండాపూర్, మియాపూర్, తెల్లాపూర్, పటాన్‌చెరు, మాదాపూర్, హైటెక్‌సిటీ, ఇటు ఉత్తరాన ఘట్కేసర్, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్‌నగర్, ఉత్తరాన మేడ్చల్, జీడిమెట్ల, పేట్‌బషీరాబాద్, కొంపల్లిలాంటి ప్రాంతాల్లో భారీ సంఖ్యలో హైరైజ్ భవనాలు నిర్మితమవుతున్నాయి. ఇప్పటికే నార్సింగి, కోకాపేట, తెల్లాపూర్‌లాంటి ప్రాంతాల్లో 60 అంతస్తుల భవనాలు వెలిశాయి.
►ALSO READ | గ్రౌండ్ వాటర్ వినియోగంలో హైదరాబాద్ సిటీ కన్నా ఢిల్లీనే నయం
ఇలాంటి భారీ నిర్మాణాలకు తప్పనిసరిగా నీటి అవసరం పెద్ద ఎత్తున ఉంటుంది. దీంతో వేల అడుగుల్లో బోర్లు వేసి నీటిని తోడేస్తున్నారు. మరోవైపు వర్షపు నీటిని భూమిలోకి పంపించేలా రెయిన్వాటర్హార్వెస్టింగ్ (ఇంకుడు గుంతల నిర్మాణం) మాత్రం పెద్దగా జరగడం లేదు. నగరమంతా కాంక్రీట్జంగిల్గా మారిపోతున్న కారణంగానే భూగర్భ జలాలు అడుగంటిపోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని నివారించాలంటే తప్పనిసరిగా ప్రతి భవనంలోనూ వర్షపునీరు భూమిలోకి వెళ్లేలా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని మెట్రోవాటర్‌బోర్డు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది 30 వేల ఇంకుడు గుంతల నిర్మాణం లక్ష్యంగా పని చేస్తున్నట్టు తెలిపారు.
