బ్రిటన్ జనరల్ ఎలక్షన్లో ప్రధాని బోరిస్ జాన్సన్ ఘన విజయం

బ్రిటన్ జనరల్ ఎలక్షన్లో ప్రధాని బోరిస్ జాన్సన్ ఘన విజయం

లండన్బ్రిటన్‌‌‌‌‌‌‌‌ జనరల్ ఎలక్షన్లో ప్రధాని బోరిస్​ జాన్సన్​ ఘన విజయం సాధించారు. తిరుగులేని మెజారిటీతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. గురువారం జరిగిన ఎన్నికల్లో ఆయన ఆధ్వర్యంలోని కన్జర్వేటివ్​పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఎగ్జిట్​ పోల్స్​అంచనాలను తలకిందులు చేస్తూ మెజారిటీ సీట్లను దక్కించుకుంది. అధికారాన్ని చేపట్టడానికి 326 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉండగా.. పూర్తి ఫలితాలు వెలువడకముందే కన్జర్వేటివ్​ పార్టీ ఈ మార్క్​ను దాటేసింది. మరో వంద సీట్ల ఫలితాలు వెలువడాల్సి ఉండగానే ఆ పార్టీ క్యాండిడేట్లు 363 చోట్ల గెలుపొందారు. దీంతో యూకే వ్యాప్తంగా నెలల తరబడి కొనసాగిన రాజకీయ అస్థిరత్వానికి ముగింపు పలికినట్లయింది. 1980లో మార్గరెట్​థాచర్​తర్వాత ఆ స్థాయిలో మెజారిటీ సాధించి బోరిస్​ జాన్సన్​ రికార్డు సృష్టించారు. లండన్​లోని అక్స్​బ్రడ్జి నియోజకవర్గంలో బోరిస్ గెలుపొందారు. మరోసారి ప్రధాని సీట్లో కూర్చోబోతున్నారు. పార్టీ విజయం కన్ఫర్మ్​ కావడంతో లండన్​లో జరిగిన విజయోత్సవ ర్యాలీలో బోరిస్​మాట్లాడుతూ.. దేశానికి ఇదో కొత్త సూర్యోదయమని అన్నారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోనని చెప్పారు. బ్రెగ్జిట్​విషయంలో మరోసారి రెఫరెండమ్​ నిర్వహించాలన్న ఆలోచనే వద్దని ఈ ఎన్నికల ద్వారా ప్రజలు తీర్పిచ్చారని చెప్పారు. బ్రెగ్జిట్ నుంచి వైదొలిగే విషయంలో మరో ఆలోచనకు తావివ్వబోమని బోరిస్​ స్పష్టంచేశారు. దీంతో పాటు దేశాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని అన్నారు. త్వరలో బకింగ్​హామ్​ ప్యాలెస్​లో క్వీన్​ ఎలిజబెత్​–2  ముందు బోరిస్​ జాన్సన్​ అధికారాన్ని చేపడతారు.

లేబర్​ పార్టీ చీఫ్​ రిజైన్

ఈ ఎన్నికల్లో లేబర్​ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కేవలం రెండొందల పైచిలుకు సీట్లలో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. ఈ ఎన్నికల వైఫల్యానికి నైతిక బాధ్యత తనదేనని, ఇకపై జనరల్​ ఎలక్షన్లలో పార్టీకి నాయకత్వం వహించబోనని జెరెమి కార్బిన్​ స్పష్టం చేశారు. లండన్​లోని ఇస్లింగ్టన్​ నార్త్​ నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో గెలుపొందారు. బ్రెగ్జిట్​ విషయంలో కార్బిన్​ స్పష్టతనివ్వకపోవడం, అధికారంలోకి రాగానే మరోసారి రెఫరెండమ్​ నిర్వహిస్తామని చెప్పడమూ  ఈ ఓటమికి ఓ కారణమని ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు. దీంతో పాటు కాశ్మీర్​ విషయంలో అంతర్జాతీయ సమాజం కల్పించుకోవాలంటూ ఎమర్జెన్సీ మోషన్​ తీసుకురావడంపై యూకేలోని ఇండియన్​ సంతతిలో అసంతృప్తికి కారణమైందని నిపుణులు చెబుతున్నారు.

మనోళ్లు అదరగొట్టారు..

యూకే జనరల్ ఎలక్షన్లలో మనోళ్లు అదరగొట్టారు. కన్జర్వేటివ్​ పార్టీతో పాటు లేబర్​ పార్టీ నుంచి పోటీచేసిన అభ్యర్థులు కూడా గెలుపొందారు. సిట్టింగ్​ ఎంపీలు 12 మంది తమ సీట్లను నిలబెట్టుకోగా.. మరో ముగ్గురు కొత్తవాళ్లు కూడా గెలిచారు. వీరిలో ఇన్ఫోసిస్​ ఫౌండర్​ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ కూడా ఉన్నారు. 27 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో మొత్తం 36,693 ఓట్లు సాధించారు. సిట్టింగ్​ స్థానాల్లో గెలిచిన ఇండియన్​ సంతతి ఎంపీలు.. ప్రీతి పటేల్, శైలేష్​ వరా, రిషి సునక్, ప్రీత్​ కౌర్​ గిల్, తన్మన్​జీత్​ సింగ్​ దేశి, వీరేంద్ర శర్మ, అలోక్​ శర్మ, స్యూయెల్లా బ్రేవర్​మాన్, లీసా నాండీ, సీమా మల్హోత్రా తదితరులు ఉన్నారు. కొత్తగా ఎన్నికైన ఇండియన్​ సంతతి లీడర్లు.. కన్జర్వేటిప్​ పార్టీ నుంచి గగన్​ మోహింద్ర, క్లైరే  కౌటిన్హో, లేబర్​ పార్టీ నుంచి నవేంద్రు మిశ్రా.