వాషింగ్టన్: పాకిస్తాన్‌కు నరేంద్ర మోదీలాంటి పవర్ఫుల్ లీడర్ కావాలని పాక్– అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ అన్నారు. ప్రధాని మోదీ భారత్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన బలమైన నాయకుడని మెచ్చుకున్నారు. మూడోసారి ఆయనే ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌లోని బాల్టిమోర్‌కు చెందిన తరార్ 1990లలో అమెరికా వెళ్లి అక్కడే సెటిలయ్యారు. బుధవారం ఓ న్యూస్ చానల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. మోదీ లీడర్షిప్ ఇండియాకే కాదు, ప్రపంచానికి మంచి చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్‌కు కూడా అలాంటి నాయకుడు రావాలని తరార్ చెప్పారు.
చర్చలు, వాణిజ్యంతో ఇరు దేశాలకు మేలు
‘‘మోదీ గొప్ప నాయకుడు. ఆయన సహజంగానే లీడర్. తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రతికూల పరిస్థితుల్లోనూ మోదీ పాకిస్తాన్లో ధైర్యంగా పర్యటించారు. పాకిస్తాన్‌తో చర్చలు, వాణిజ్యం ప్రారంభిస్తారని ఆశిస్తున్నా. శాంతియుత వాతావరణం రెండు దేశాలకు మంచి చేస్తుంది”అని తరార్ అన్నారు. భారత్‌లో 97 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోవడం ఒక అద్భుతమని ఆయన కొనియాడారు. దేశంలో మోదీకి పెరుగుతున్న ప్రజాదరణను చూస్తున్నానని, మళ్లీ ఆయనే పీఎం అని అంతా అంటున్నారని చెప్పారు. 2024లో భారత్ ఎదుగుదల అద్భుతంగా ఉందన్నారు. భవిష్యత్తులో భారత ప్రజాస్వామ్యం మార్గదర్శకంగా మారుతుందని చెప్పారు.
పాక్‌లో సమస్యలు తీర్చే లీడర్ రావాలి
పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, ద్రవ్యోల్బణం.. పెట్రోల్ ధరలు పెరిగాయని, ఎగుమతులు చేయలేని పరిస్థితికి వచ్చిందని తరార్ ఆందోళన వ్యక్తం చేశారు. కరెంటు బిల్లులు పెరగడమే పీవోకేలో నిరసనలకు ప్రధాన కారణమని చెప్పారు. పాక్‌లో సమస్యలను మూలాల నుంచి పెకిలించి వేసే ప్రయత్నాలు జరగట్లేదన్నారు. ‘‘ఎగుమతులు ఎట్ల పెంచాలె? టెర్రరిజాన్ని ఎట్ల కంట్రోల్ చేసుడు? శాంతిభద్రతలను మెరుగుపర్చడం ఎలా? పీవోకేలో అశాంతి, రాజకీయ అస్థిరత నెలకొంది. ఈ సమస్యలన్నింటి నుంచి మమ్మల్ని గట్టెక్కించే నాయకుడు రావాలని కోరుకుంటున్నం”అని తరార్ అన్నారు.