చైనా వ‌స్తువుల బాయ్‌కాట్‌తో ఆ దేశానికేం న‌ష్టం లేదు: చిదంబ‌రం

చైనా వ‌స్తువుల బాయ్‌కాట్‌తో ఆ దేశానికేం న‌ష్టం లేదు: చిదంబ‌రం

భార‌త్ – చైనా స‌రిహ‌ద్దుల్లో గాల్వ‌న్ లోయ వ‌ద్ద ఇరు దేశాల సైనికుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణల నేప‌థ్యంలో పెద్ద వినిపిస్తున్న బాయ్‌కాట్‌ చైనా గూడ్స్ నినాదంపై కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబ‌రం భిన్నంగా స్పందించారు. చైనా వ‌స్తువుల‌ను బాయ్‌కాట్ చేయ‌డం వ‌ల్ల చైనా ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు న‌ష్ట‌మేమీ ఉండ‌ద‌ని అన్నారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. భార‌త్ స్వ‌యం ఆధారితంగా మారాల‌ని అన్నారు. వీలైనంత ఎక్కువ‌గా స్వీయ ఆధారితంగా మారాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, అయితే ప్ర‌పంచంతో దూరంగా జ‌ర‌గ‌కూడ‌ద‌ని చెప్పారు. గ్లోబ‌ల్ స‌ప్లై చైన్‌లో భాగంగా భార‌త్ కొన‌సాగాల‌ని చిదంబ‌రం సూచించారు. చైనా వ‌స్తువులను బాయ్‌కాట్ చేయాల‌న్న ఆలోచ‌న స‌రికాద‌ని, చైనా యావ‌త్ ప్ర‌పంచంతో చేస్తున్న వాణిజ్యంలో భార‌త్ భాగ‌మెంతో ఆలోచించాల‌ని, అది ఒక్క చిన్న భాగం మాత్ర‌మే ఉంటుంద‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో చైనా వ‌స్తువుల‌ను భార‌త్ నిషేధించినంత మాత్రాన చైనా ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు పోయేదేమీ లేద‌న్నారు. దేశ‌ ర‌క్ష‌ణ లాంటి పెద్ద అంశం గురించి చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో చైనా వ‌స్తువుల బాయ్‌కాట్ లాంటి ఇష్యూని తెర‌పైకి తేవ‌డం స‌రికాద‌ని చెప్పారాయ‌న‌.