హైదరాబాద్ సిటీ, వెలుగు: డిజిటల్ విద్య, ఏఐ, సాంకేతిక ఆధారిత అభ్యాస రంగాల్లో అంతర్జాతీయ సహకారం కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం(బీఆర్‌ఏవోయూ) కెనడాలోని వాంకోవర్‌కు చెందిన కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్(సీఓఎల్)తో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, సీఓఎల్ అధ్యక్షుడు, సీఈవో ప్రొఫెసర్ పీటర్ స్కాట్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
తెలంగాణ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ ధోత్రే, ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ భాగస్వామ్యంతో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, విద్యారంగంలో ఏఐ పరిశోధన ప్రయోగశాల ఏర్పాటు, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ రూపకల్పన తదితర అంశాల్లో ఇరు సంస్థలు సంయుక్తంగా పనిచేయనున్నాయి.
ఈ ఒప్పందం విశ్వవిద్యాలయ చరిత్రలో గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందని, బీఆర్‌ఏవోయూను ఏఐ ఆధారిత గ్లోబల్ డిజిటల్ ఓపెన్ యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు దోహదపడుతుందని వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. డిజిటల్ విద్యారంగంలో బీఆర్‌ఏవోయూ అంతర్జాతీయ నమూనాగా ఎదుగుతుందని, భారత్‌తో పాటు కామన్‌వెల్త్ దేశాల్లో నాణ్యమైన ఉన్నత విద్య విస్తరణకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని సీఓఎల్ సీఈవో ప్రొఫెసర్ పీటర్ స్కాట్ పేర్కొన్నారు.
