నేను ఇంత వైరల్‌‌ అయిత అనుకోలే... ఓట్‌‌ చోరీ వార్తల్లో నా ఫొటో చూసి షాకయ్యా: బ్రెజిల్‌‌ మహిళ

నేను ఇంత వైరల్‌‌ అయిత అనుకోలే... ఓట్‌‌ చోరీ వార్తల్లో నా ఫొటో చూసి షాకయ్యా: బ్రెజిల్‌‌ మహిళ
  • రాహుల్‌‌ గాంధీ పవర్‌‌‌‌ పాయింట్ ప్రజంటేషన్‌‌పై స్పందన

న్యూఢిల్లీ: భారత్‌‌లో ఓట్‌‌ చోరీ ఎపిసోడ్‌‌లో తన ఫొటో చూసి షాకయ్యానని బ్రెజిల్‌‌కు చెందిన మహిళ లారిస్సా నెరీ చెప్పారు. హర్యానా‌‌లో 22 పోలింగ్‌‌ బూత్‌‌ల పరిధిలో బ్రెజిలియన్‌‌ మోడల్‌‌ లారిస్సా పేరు, ఫొటోతో ఓటర్‌‌‌‌ ఐడీలు క్రియేట్‌‌ చేశారంటూ కాంగ్రెస్‌‌ లీడర్‌‌‌‌ రాహుల్‌‌ గాంధీ ఇచ్చిన పవర్‌‌‌‌ పాయింట్‌‌ ప్రజంటేషన్‌‌పై ఆమె గురువారం స్పందించారు. అది తన పాత ఫొటోనే అని చెప్పారు. తన ఫొటోతో స్కామ్‌‌లకు పాల్పడుతున్నారని తెలిసిందని మండిపడ్డారు. ‘‘20 ఏండ్ల వయసులో నేను తీసుకున్న ఫొటో అది. నన్ను భారతీయురాలిగా చిత్రీకరించి మోసం చేస్తున్నారు. ఇదేం పిచ్చితనం. 

మన సమాజం ఎటు పోతోంది?”అని ఆమె ప్రశ్నించారు. తాను మోడల్‌‌ను కాదని, ఓ హెయిర్‌‌‌‌ డ్రెస్సర్‌‌‌‌ని అని తెలిపారు. ‘‘ఇండియాలో నా ఫొటోతో జరుగుతున్నదేంటో తెలియదుగానీ, ఇంత వైరల్‌‌ అవుతానని మాత్రం అనుకోలేదు. ఎవరెవరో  నా గురించి ఆరా తీస్తున్నారు. ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో కాల్‌‌ చేసి ఇంటర్వ్యూలు అడుగుతున్నారు. ఏం చెప్పాలో తెలియట్లేదు. నేనెవరో తెలుసుకునేందుకు విపరీతంగా సెర్చ్‌‌ చేసి వివరాలను హ్యాక్‌‌ చేశారు. ఆఖరికి నా ఇన్‌‌స్టా అకౌంట్‌‌ బ్లాక్‌‌ అయింది”అని లారిస్సా వీడియో మెస్సేజ్‌‌లో పేర్కొన్నారు. 

మీడియావాళ్లు కూడా తనను సంప్రదిస్తున్నారని తెలిపారు. ‘‘మొత్తానికి నేనొక మిస్టీరియస్‌‌ బ్రెజిలియన్‌‌ మోడల్‌‌గా ఫేమస్‌‌ అయిపోయా”అని ఆమె పేర్కొన్నారు. కాగా, బ్రెజిల్‌‌ మహిళ లారిస్సా ఫొటోతో ఉన్న మరో ఓటర్‌‌‌‌ కార్డు హర్యానా ఓటర్‌‌‌‌ లిస్ట్‌‌లో బయటపడింది. రెండేండ్ల కింద చనిపోయిన గునియా అనే మహిళ పేరు ఇప్పటికీ ఓటర్‌‌‌‌ లిస్ట్‌‌లో అలాగే ఉంది. అయితే, అందులో పేరు, అడ్రస్‌‌ అంతా గునియాకు సంబంధించినదే అయినప్పటికీ ఫొటో మాత్రం లారిస్సాది ఉన్నట్లు మీడియా నివేదికలు బయటపెట్టాయి.