గొర్రెల స్కీంకు బ్రేక్.. నల్గొండలో 254 మందికే ఇచ్చి బంద్

గొర్రెల స్కీంకు బ్రేక్.. నల్గొండలో 254 మందికే ఇచ్చి బంద్
  • డీడీలు కట్టిన 28,355 మందికి ఇయ్యట్లే..
  • మార్కెట్​లో గొర్రెల రేట్లు పెరిగాయనే సాకు
  • యూనిట్​ కాస్ట్​తో 21 గొర్రెలు రావంటున్న ఆఫీసర్లు
  • బెనిఫిట్స్ తగ్గించే ఆలోచనలో సర్కారు
  • ఇప్పటికే జిల్లా స్థాయిలో గొర్రెల కొనుగోళ్లు రద్దు
  • స్టేట్ లెవల్​లో ప్రత్యేకంగా సీపీటీ ఏర్పాటు

నల్గొండ, వెలుగురాష్ట్రంలో గొర్రెల పంపిణీ మళ్లీ ఆగిపోయింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఉండటంతో హడావుడిగా రెండో విడత గొర్రెల పంపిణీ మొదలుపెట్టిన టీఆర్ఎస్ సర్కారు.. ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యకుండానే నిలిపేసింది. గొర్రెల రేట్లు పెరిగాయనే సాకు చెప్తూ స్కీమ్​ను ఆపేసింది. ప్రస్తుత యూనిట్​ కాస్ట్​తో నిర్ణయించిన మేరకు గొర్రెలు రావడం లేదని, దీనితో బెనిఫిట్స్​ తగ్గించాలని సర్కారు ఆలోచిస్తోందని ఆఫీసర్లు చెప్తున్నారు.

అయితే సర్కారు గొర్రెల పంపిణీని నామ్​కేవాస్తేగా మొదలుపెట్టిందని.. సాగర్ లో యాదవ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో నల్గొండ జిల్లాలో స్కీంను ప్రారంభిస్తే  ఓట్లు పడతాయని ప్లాన్ చేసిందన్న విమర్శలు వస్తున్నాయి. అసలు గొల్ల కురుమలకు సంక్రాంతి పండుగ కానుకగా రెండో విడత గొర్రెల పంపిణీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, డీడీలు కట్టిన 28,335 మందికి సబ్సిడీ గొర్రెలు పంపిణీ చేస్తామని జనవరి 9న జరిగిన రివ్యూ మీటింగ్​లో మంత్రి తలసాని ప్రకటించారు. అదే నెల 16న నల్గొండలో గొర్రెల పంపిణీ ప్రారంభించి.. 254 యూనిట్లకు శాంక్షన్ ఇచ్చారు. అంతే అదే రోజుతో స్కీం అమలు ఆగిపోయింది.

రేట్లు పెరిగినయనే సాకుతో..

మార్కెట్లో గొర్రెల రేట్లు పెరగడం వల్లే స్కీం అమలును ఆపేశామని జిల్లాల్లో ఆఫీసర్లు చెప్తున్నారు. 2017లో స్కీం మొదలుపెట్టినప్పుడు లైవ్ గొర్రెల రేటు కేజీకి రూ.280 నుంచి రూ.300 వరకు ఉండేది. కానీ ఇప్పుడు మార్కెట్‌లో రూ.400 నుంచి రూ.450 దాకా పలుకుతోంది. మార్కెట్‌లో ఇటీవల మటన్ రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి. ఇంకా పెరుగుతున్నాయి. గొర్రెల రేట్లు కూడా పెరుగుతున్నాయని ఆఫీసర్లు చెప్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న యూనిట్ కాస్ట్​కు గొర్రెలు దొరకడం లేదని అంటున్నారు.

బెనిఫిట్స్​లో కోత పెట్టే ఆలోచన

గొర్రెల పంపిణీ స్కీం యూనిట్ కాస్ట్ రూ.1.25 లక్షలు. ఇందులో లబ్ధిదారుడి వాటా రూ.31,250 పోగా.. ప్రభుత్వం రూ.93,750 సబ్సిడీ ఇస్తోంది. దీంట్లో గొర్రెలు కొనేందుకు వాడేది రూ.లక్షా పదకొండు వేలు. మిగతా రూ.24 వేలను రవాణా, ఇన్సూరెన్స్, మందులు, దాణా ఖర్చుల కింద చెల్లిస్తోంది. ఇప్పుడున్న రేట్లను బట్టి రూ.లక్షా 11 వేలతో 20 గొర్రెలు, ఒక పొట్టేలు కొనడం సాధ్యం కానందున బెనిఫిట్స్​లో కోత పెట్టాలని సర్కారు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి కాబట్టి మిగతా మూడింటిలో దేనికైనా కోత పెట్టే చాన్స్​ ఉందని తెలిసింది.

జిల్లా లెవల్ లో కొనుగోళ్లు బంద్..

నల్గొండలో మంత్రి ప్రోగాం తర్వాత.. జిల్లా లెవల్​లో గొర్రెల కొనుగోళ్లు బంద్ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పుడున్న యూనిట్ కాస్ట్ ప్రకారమైతే గొర్రెలు కొనడం కష్టమని ఆఫీసర్లు చెప్తున్నారు. సగటున ఒక్కో గొర్రెకు సర్కారు రూ.5,200 రేటు కడుతోందని.. అదే మార్కెట్ లో 30 కేజీల బరువున్న గొర్రెకు కేజీ రూ.450 చొప్పున లెక్కకడితే రూ.13,500 అవుతుందని అంటున్నారు. సర్కారు ఇచ్చే డబ్బులు సర్దుబాటుగాక కొన్ని పెద్ద, కొన్ని చిన్న సైజు సాధారణ జాతుల గొర్రెలను కలిపి లబ్ధిదారులకు ఇస్తున్నారు. గొల్లకుర్మలు మాత్రం మేలు జాతి గొర్రెలు కావాలంటున్నారు.

గంపగుత్తగా కొంటే..

జిల్లా లెవల్ లో గొర్రెలు కొనకుండా స్టేట్ లెవల్లో డైరెక్టర్ స్థాయిలో గంప గుత్తగా గొర్రెలు కొనేలా సర్కారు ప్లాన్​ చేస్తోందని ఆఫీసర్లు చెప్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా సెంట్రలైజెడ్ ప్రొక్యూర్మెంట్ సెల్ టీమ్స్ (సీపీటీ) ఏర్పాటు చేసిందని అంటున్నారు. ఈ సీపీటీలో అడిషనల్ డైరెక్టర్, ఇద్దరు డాక్టర్లు ఉంటారు. జిల్లా లెవల్లో ఇద్దరు ఏడీలు, వాళ్ల కింద ఇద్దరు డాక్టర్లు ఉంటారు. గొర్రెలు కొనేందుకు సర్కారు ప్రత్యేకంగా ఒక ప్రైవేట్​ కంపెనీని ఎంపిక చేస్తుంది. ఈ కంపెనీ ద్వారానే గంపగుత్తగా గొర్రెలు కొనాలని భావిస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి వచ్చే లబ్ధిదారుల లిస్ట్ ఆధారంగా ముందుగా ఏ మండలానికి గొర్రెలు పంపాలనేది సీపీటీ సెల్ నిర్ణయిస్తుంది. ఈ ప్రోగాంను ఏరకంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై జిల్లా టీమ్​లకు శిక్షణ ఇచ్చారు.

మటన్ రేటు పెరిగిందేం?

మొదటి విడతలో పంపిణీ చేసిన గొర్రెలతో 2017–-18 లో 20.75 లక్ష లు, 2018-–19 లో 39.94 లక్షలు, 2019–20 లో 39.28 లక్షలు, 2020–2 1 లో 37.12 లక్షల గొర్రెల సంపదను సృష్టించామని రాష్ట్ర సర్కారు అంటోంది. మొత్తంగా కోటీ 37 లక్షల గొర్రె పిల్లలు జన్మించాయిని ఇటీవల మంత్రి కూడా ప్రకటించారు. ఇన్ని గొర్రెలు పెరిగితే మటన్​ రేట్లు తగ్గాలి, లేదా అలాగే ఉండాలి. కానీ అనూహ్యంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కిలో మటన్​ రూ.700కు పైగా ఉంది. వాస్తవానికి చాలా చోట్ల ఆఫీసర్లు స్కీమ్​ను పక్కదారి పట్టించారని, గొర్రెలను కొనకుండానే కొన్నట్లు చూపి పైసలు పంచుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రంలోనే గొర్రెలను కొంటూ, ఇస్తూ రీసైకిల్​ చేసిన.. వేరే రాష్ట్రాల నుంచి తెచ్చినట్టు చూపించిన ఘటనలు కూడా బయటపడ్డాయి. కానీ సర్కారు పెద్దలు ఇవేవీ లెక్కలోకి తీసుకోకుండా.. కోట్ల గొర్రెలు పెరిగాయంటూ ప్రకటనలు చేశారు.

స్కీం పైసలు సరిపోతలెవ్వు

మార్కెట్‌లో గొర్రెల రేట్లు పెరిగాయి. మటన్ వినియోగం పెరగడంతో రైతులు గొర్రెల రేట్లు పెంచారు. దీంతో ఇప్పుడున్న యూనిట్ కాస్ట్ సరిపోవట్లేదు. అందువల్లే స్టేట్ లెవల్​లోనే మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. ఇక నుం చి ఈ సెల్ నుంచే గొర్రెలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వీలైనంత త్వరగా గొర్రెలు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటాం.

– వి. శ్రీనివాస్​రావు, డీవీఏహెచ్ఓ, నల్గొండ.