- పైలెట్ ప్రాజెక్ట్ కింద ఆదిలాబాద్, భద్రాద్రి జిల్లాలు ఎంపిక
- ఈ నెల 12 నుంచి అమలు చేయనున్న సర్కార్ మెనూలో ఉప్మా, కిచిడి
- ఇప్పటికే చిన్నారులకు అందుతున్న పాలు
- ఎండ తీవ్రత కారణంగా సెలవుల పొడిగింపుపై కసరత్తు
హైదరాబాద్, వెలుగు : అంగన్‌వాడీ సెంటర్లలో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఆదిలాబాద్, భద్రాద్రి జిల్లాలను ఎంపిక చేయగా.. ఆయా అంగన్‌వాడీల్లో ఈ నెల 12 నుంచి స్కీమ్‌ను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ స్కీమ్ వాస్తవానికి ఏప్రిల్‌లోనే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం వేసవి సెలవులు పూర్తి అయ్యి అంగన్‌వాడీ కేంద్రాలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను ప్రారంభించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఈ స్కీమ్ కింద ఏడాదిలో 300 రోజులపాటు చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్ అందించనున్నారు. మెనూలో భాగంగా ప్రతిరోజూ 25 గ్రాముల కిచిడీ మిక్స్ లేదా ఉప్మా మిక్స్‌తో చేసిన అల్పాహారాన్ని వడ్డించనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద నెల రోజుల పాటు స్కీమ్‌ను అమలు చేసి, ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరి చేసుకున్న అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది.
పోషకాహార లోపానికి పూర్తిగా చెక్ పెట్టేలా...
రాష్ట్రంలోని చిన్నారుల్లో పోషకాహారంలోపం సమస్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం అనే సమస్య నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే – 5 ప్రకారం 33 శాతం ఉండగా.. సర్వే 6 ప్రకారం 27 శాతానికి తగ్గింది. అలాగే ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం అనేది 22 శాతం నుంచి 17 శాతానికి, తక్కువ బరువు ఉన్న పిల్లల సంఖ్య 32 నుంచి 28 శాతానికి తగ్గింది. సమస్య గతంతో పోలిస్తే ప్రస్తుతం మెరుగైనప్పటికీ... న్యూట్రిషన్ సమస్యకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో చిన్నారులకు బాల్య దశలోనే పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్‌వాడీల్లోని పిల్లలకు ఇప్పటికే ప్రతిరోజూ పాలను అందిస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌ను కూడా చేర్చడంతో చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆఫీసర్లు భావిస్తున్నారు.
వేసవి సెలవులు పొడిగించే చాన్స్
రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతుండడంతో అంగన్‌వాడీల వేసవి సెలవుల పొడిగింపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం మే 1 నుంచి జూన్ 1 వరకు సెలవులు ప్రకటించగా, ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నపిల్లలను సెంటర్లకు తీసుకురావడం ఇబ్బందికరంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్న కారణంగా.. సెలవులను ఈ నెల 10 లేదా 12వ తేదీ వరకు పొడిగించే యోచనలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఉంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టమైన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. సెలవుల పొడిగింపు అమల్లోకి వస్తే జూన్ 12 నుంచి బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలులోకి రానుంది. ఈ వారం రోజులు కూడా టేక్ హోం రేషన్ పద్ధతిలో చిన్నారులకు, గర్భిణులకు పోహకాహారాన్ని అందించే అవకాశం ఉంది.
