దేనికైనా టైం రావాలి! 2 ఏళ్లు వేచి చూసి ఫొటో తీశాడు

దేనికైనా టైం రావాలి! 2 ఏళ్లు వేచి చూసి ఫొటో తీశాడు

చందమామ ఎప్పటికీ అందమైనోడే. అద్భుతమైనోడే. ఎన్నెన్నో రహస్యాలను దాచుకున్నోడే. అందుకే సైన్స్​ మామ చుట్టూ తిరుగుతుంది. ఏదో ఒక ప్రయోగం జరుగుతూనే ఉంటుంది. సైన్సే కాదు, మామ అంటే మామూలు మనిషికీ మంచి ఆత్మబంధువే. అన్నం తినని పిల్లలకు జాబిల్లిని చూపిస్తూ తినిపిస్తుంది అమ్మ. నిద్రపుచ్చడానికి చందమామ కథలూ ఉన్నాయి. మరి, అంత అందమైన మామను మరింత అందంగా ఓ కెమెరాలో బంధించేసి, పేపర్​ ముక్కపై రప్పించాలంటే ఎంత ఓపికుండాలి. ఆ ఓపిక ఫలితమే ఈ ఫొటో.

బ్రిటన్​కు చెందిన ఆండ్రూ డాసన్​ (44) అనే అంతరిక్ష ఫొటోగ్రాఫర్​ ఈ ఫొటో కోసం 2 ఏళ్లు వేచి చూశాడు. నార్త్​యార్క్​షైర్​లోని రోజ్​బెర్రీ టాపింగ్​ కొండపై నుంచి మామ ఫొటోను క్లిక్​మనిపించాడు. ఈ రెండేళ్లలో సాయంత్రం కాగానే గంట గంటన్నరసేపు చందమామను చూస్తూ ఉండేవాడట. ఎంతసేపు వేచి చూసినా అంత అందంగా కనిపిస్తేనా..! ఓ రోజు సాయంత్రం తాను అనుకున్న విధంగా చంద్రుడు కనిపించే సరికి తన 600 ఎంఎం లెన్స్​ కెమెరాతో బంధించేశాడు. దాదాపు 5 కిలోమీటర్ల దూరం నుంచి ఈ ఫొటో తీశాడు. ఈ రెండేళ్లలో వందకు పైగా చందమామ ఫొటోలు తీశాడు డాసన్​.