గంగాధర/కోరుట్ల/కరీంనగర్ సిటీ, వెలుగు: చట్టం సామాన్యులకు ఒకలా, అధికారంలో రాజకీయ నాయకులకు మరోలా అమలవుతుందా అని బీఆర్‌ఎస్ లీడర్లు ప్రశ్నించారు. సోమవారం కరీంనగర్, గంగాధర, కోరుట్లలో బాలికను వేధించిన కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయిభగీరథ్‌పై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ లీడర్లు డిమాండ్ చేశారు. గంగాధర మండలం మధురానగర్‌లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కేసులో కాంగ్రెస్ లీడర్లు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
కోరుట్ల కొత్త బస్టాండ్ కూడలి వద్ద ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భగీరథ్ అరెస్టు కాకపోవడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. ఒక రేపిస్ట్ తండ్రిని పక్కన కూర్చోబెట్టుకొని తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో లైబ్రరీ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లీడర్లు ధర్నా చేపట్టారు. ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి మాట్లాడుతూ బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
భగీరథ్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదు?
లింగంపేట, వెలుగు: కేంద్రమంత్రి బండిసంజయ్‌ను మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్చేయాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన గాంధారి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బండి సంజయ్కొడుకుపై పోక్సో కేసు నమోదైనందున కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి సంజయ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. అధికారం ఉందని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కేసును పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కేసు నమోదై మూడు రోజులు గడిచినా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. మాజీ జడ్పీటీసీ తానాజీరావు తదితరులు ఉన్నారు.
