ఆగుతున్నై.. కాలుతున్నై..! జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల్లో పొగలు, మంటలు

ఆగుతున్నై.. కాలుతున్నై..! జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల్లో పొగలు, మంటలు
  •     బ్యాటరీల పనితీరుపైనే అనుమానాలు
  •     వరుస ఘటనలపై ఆర్టీసీ, జేబీఎం సంస్థల జాయింట్ ఎంక్వైరీ
  •     ఫైర్ డిటెక్షన్ అలారమ్ సిస్టమ్ కారణంగా తప్పుతున్న ప్రాణనష్టం

కరీంనగర్, వెలుగు: టీజీఎస్ఆర్టీసీలో సేవలందిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు ఇటీవలి కాలంలో ప్రమాదాలకు గురవుతుండడంతో ప్రయాణికుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని బస్సుల్లోంచి పొగలు వస్తుండగా, మరికొన్ని బస్సులు మార్గమధ్యలోనే ఆగిపోతున్నాయి. తాజాగా ఈ నెల 21న కరీంనగర్ నగర పరిధిలోని అలుగునూరు వద్ద ఓ ఎలక్ట్రిసిటీ బస్సు కాలిపోవడం మరింత భయాందోళనకు గురిచేసింది. 

ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో ఉన్న ఫైర్ డిటెక్షన్ అలారమ్ సిస్టం (ఎఫ్డీఏఎస్)కారణంగా అలర్ట్ అయిన డ్రైవర్ ప్రయాణికులను కిందకు దించేయడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే ఈ ప్రమాదాన్ని సీరియస్ గా తీసుకున్న టీజీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు, జేబీఎం సంస్థ యాజమాన్యం జాయింట్ ఎంక్వైరీ ప్రారంభించాయి.

రాష్ట్రంలో 500 ఎలక్ట్రిక్ బస్సులు

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ పరిధిలోని వివిధ రీజియన్లలో సుమారు 500 ఎలక్ర్టికల్ బస్సులు ఉండగా.. కరీంనగర్ రీజియన్ లో 104 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో సూపర్ లగ్జరీ, డీలక్స్ తో పాటు ఎక్స్ ప్రెస్ సర్వీసులు సైతం ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు కావడం, సీటింగ్ బాగుండడంతో పాటు శబ్దం లేకుండా ప్రయాణానికి సౌకర్యవంతంగా ఉండడంతో ఈ బస్సుల్లో ప్రయాణానికి చాలా మంది ఇష్టపడుతున్నారు.

 కాలుష్య నివారణ కోసం ఈ బస్సులను దశలవారీగా పెంచాలని ఆర్టీసీ భావిస్తున్న తరుణంలో.. బస్సులో మంటలు లేచి పూర్తిగా దగ్ధం కావడం షాక్ కు గురి చేసింది. ఈ బస్సులు కొన్ని సార్లు 20, 30 కిలోమీటర్లకోసారి ఆగిపోవడం కూడా ప్రయాణికులను అసహనానికి గురిచేస్తోంది. ఈ బస్సులు రోజుకు సగటున 531 కిలోమీటర్లు తిరుగుతున్నాయని, ఎప్పుడో ఒకటి మాత్రమే ఇలాంటి సమస్యను ఎదుర్కొంటుందని, అన్ని బస్సులు అలాగే ఉన్నాయనుకోవడం సరికాదని కరీంనగర్ టు డిపో మేనేజర్ ఎం. శ్రీనివాస్ వెల్లడించారు.   

బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ అలారమ్ సిస్టమ్

ఎలక్ట్రిసిటీ బస్సుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫైర్ డిటెక్షన్ అలారమ్ సిస్టం(ఎఫ్డీఏఎస్) చాలా ఉపయోగకరంగా మారింది. బస్సులో ఏ భాగం నుంచి పొగలు వచ్చినా వెంటనే ఈ సిస్టమ్ సైరన్ మోగిస్తుంది. దీంతో డ్రైవర్ అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటీవల అలుగునూరు వద్ద జరిగిన బస్సు దగ్ధం ఘటనలోనూ ఈ సిస్టమ్ కారణంగానే డ్రైవర్ అప్రమత్తమైనట్లు కరీంనగర్ 2 డిపో మేనేజర్ వెల్లడించారు. బస్సుల్లో ఈ టెక్నాలజీ వల్లే ఎలాంటి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం లేదన్నారు. 

బ్యాటరీల పనితీరుపైనే అనుమానాలు

జేబీఎం సంస్థకు చెందిన ఎలక్ట్రికల్ బస్సుల్లో లిథియం ఆయాన్ బ్యాటరీలు వినియోగిస్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ తో ఈ బ్యాటరీలకు మంటలు అంటుకుంటే బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయ్యే వరకు మండుతూనే ఉంటుంది. నీళ్లతో గానీ, ఫైర్ ఎక్స్ ట్వింగిషర్లతో గానీ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం ఉండదని, మంటలు అదుపులోకి రావని నిపుణులు చెప్తున్నారు. అలుగునూరులో జరిగిన బస్సు దగ్ధం ఘటనలోనూ బ్యాటరీలకు మంటలు అంటుకోవడం వల్లే ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాకపోవడం వల్లే బస్సు పూర్తిగా దగ్ధమైందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఆర్టీసీ, జేబీఎం సంస్థల జాయింట్ ఎంక్వైరీ

కరీంనగర్ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం ఘటనపై విచారించేందుకు ఐదుగురితో కూడిన టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ బృందం కరీంనగర్ 2 డిపోకు చేరుకుని రెండు రోజులుగా విచారణ చేపట్టింది. వీరిలో ఇద్దరు అధికారులు హైదరాబాద్ కు చెందినవారు, మరో ఇద్దరు ఢిల్లీకి చెందినవారు కాగా, చైనాకు చెందిన కంపెనీ ఎక్స్ పర్ట్  ఒకరు ఉన్నారు. 

బస్సులో మంటలు రావడానికి దారి తీసిన కారణాలు, వైరింగ్, ఇతర చోట్ల ఉన్న టెక్నికల్ ఇష్యూస్, బ్యాటరీ లోపాలపై దృష్టి సారించారు. కొన్ని బస్సులు తరచూ ఆగిపోవడానికి గల కారణాలపైనా దృష్టి సారించారు. ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ ఆర్ఎం రాజు, టు డిపో మేనేజర్ ఎం.శ్రీనివాస్ తో సమావేశమయ్యారు. రిపోర్టును త్వరలోనే ఆర్టీసీ ఎండీకి అందజేయనున్నట్లు తెలిసింది. 

ఇటీవలి ఘటనలు

  • 2023 లో ఏప్రిల్ 7న హైద‌‌రాబాద్‌‌లోని బేగంపేట‌‌లో వేగంగా వెళ్తున్న ఎల‌‌క్ట్రిక్ బ‌‌స్సులో మంట‌‌లు చెల‌‌రేగాయి. అలర్ట్ అయిన డ్రైవ‌‌ర్‌‌ బ‌‌స్సును పక్కన ఆపేశాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంట‌‌ల‌‌ను అదుపు చేశారు.
  •     గతేడాది జూన్ 28న కరీంనగర్ 2 డిపో నుంచి బస్టాండ్ లోకి వెళ్లేందుకు ఎలక్ట్రిక్ బస్సును స్టార్ట్ చేయగానే పొగలు, మంటలు వచ్చాయి. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
  •     గతేడాది సెప్టెంబర్ 4న హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సు డిచ్ పల్లి మండలం ధర్మారం సమీపంలోకి చేరుకోగానే పొగలు వచ్చాయి. డ్రైవర్ గమనించి బస్సును పక్కన ఆపేయడం, మంటలను ఆర్పివేయడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.