బీజేపీ కార్పొరేటర్‌‌పై హత్యాయత్నం..యాక్సిడెంట్ కేసులో ట్విస్ట్.. కరీంనగర్ లో జూన్ 17న ఘటన

బీజేపీ కార్పొరేటర్‌‌పై హత్యాయత్నం..యాక్సిడెంట్ కేసులో ట్విస్ట్.. కరీంనగర్ లో జూన్ 17న ఘటన
  • కారుతో ఢీకొట్టి వెళ్లిపోయిన నిందితులు
  • ఇద్దరిని అరెస్ట్​ చేసిన పోలీసులు

కరీంనగర్, వెలుగు: బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్‌‌పై హత్యాయత్నం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 17న రాత్రి బైక్‌‌పై వెళ్తున్న వేణుప్రసాద్‌‌ను కారు ఢీకొట్టడంతో తొలుత పోలీసులు రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేశారు. అయితే విచారణలో అది హత్యాయత్నమని తేలింది. కరీంనగర్ త్రీ టౌన్ సీఐ తిరుమల గౌడ్ కథనం ప్రకారం.. కిసాన్‌‌నగర్ 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ ఈ నెల 17న రాత్రి సుమారు 11 గంటల సమయంలో బైక్‌‌పై ఇంటికి వెళ్తున్నారు. 

ఈ క్రమంలో కిసాన్‌‌నగర్‌‌లోని రమణయ్య టిఫిన్ సెంటర్ సమీపంలో ఆయన బైక్‌‌ను వెనకాల నుంచి టయోటా గ్లాంజా కారులో వచ్చిన సుంచు కిషోర్, సుద్దాల ప్రణయ్ అలియాస్ జానీ ఢీకొట్టారు. దీంతో వేణుప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన చనిపోయాడని భావించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. తొలుత ఈ ఘటనను సాధారణ రోడ్డు ప్రమాదంగా నమోదు చేసిన పోలీసులు, అనంతరం దర్యాప్తు ముమ్మరం చేశారు.

 ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా, కారు వచ్చిన తీరుపై అనుమానాలు తలెత్తాయి. ఉద్దేశపూర్వకంగానే కారుతో ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ, కారు ఆధారంగా నిందితులు సుంచు కిషోర్, సుద్దాల ప్రణయ్ అలియాస్ జానీని అదుపులోకి తీసుకుని విచారించారు. పాత కక్షల కారణంగానే వేణుప్రసాద్‌‌ను హత్య చేయాలని వారు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. 

పోలీసులు నిందితుల నుంచి కారు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఇద్దరిని రిమాండ్‌‌కు తరలించారు. కిసాన్‌‌నగర్ ప్రభుత్వ భూముల కబ్జాలపై పోరాడుతున్నందునే తనను చంపాలని చూస్తున్నారని సోమిడి వేణుప్రసాద్ ఆరోపించారు. హత్యాయత్నం వెనుక అసలు సూత్రధారులెవరో తేల్చాలని సీపీని కోరారు.