జనాలకు వ్యాక్సిన్ తిప్పలు.. కొనేందుకు ధైర్యం చేయని రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

జనాలకు వ్యాక్సిన్ తిప్పలు.. కొనేందుకు ధైర్యం చేయని రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • జనాలకు వ్యాక్సిన్ తిప్పలు
  • కొనేందుకు ధైర్యం చేయని రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ దొరకట్లేదు

హైదరాబాద్, వెలుగు: కరోనా కేసులు పెరుగుతుండడంతో జనాలు మళ్లీ వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌పై ఇంట్రస్ట్‌‌‌‌‌‌‌‌ చూపిస్తున్నారు. కానీ, రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖాన్లలో ఎక్కడా వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో నిరుత్సాహంగా వెనుదిరుగుతున్నారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులను కేంద్ర ప్రభుత్వం సప్లై చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తమ అవసరాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలే కొనుగోలు చేసుకోవాలని సూచించింది. తెలంగాణకు 20 లక్షల వ్యాక్సిన్ డోసులు కావాలని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసినా, రాష్ట్ర ప్రభుత్వాలే కొనుగోలు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి స్పష్టం చేశారు. అయితే ప్రజలకు అవసరమైన వ్యాక్సిన్ల కొనుగోలుపై రాష్ట్ర సర్కార్ ముందడుగు వేయడం లేదు. బయోలాజికల్–ఈ సంస్థ 15 లక్షల కొర్బెవ్యాక్స్ డోసులను ఉచితంగా ఇచ్చేందుకు ముందుకొచ్చిందని వారం రోజుల కింద హరీశ్‌‌‌‌‌‌‌‌రావు ప్రకటించారు. కానీ, ఇప్పటివరకూ అవి ఆరోగ్యశాఖకు అందలేదు. దీంతో వ్యాక్సిన్ కోసం వస్తున్న వారిని వెనక్కి పంపించక తప్పడం లేదని అధికారులు చెబుతున్నారు.

9 లక్షల మంది సెకండ్​ డోసు తీసుకోలే

చాలా దేశాలు ఇప్పటికీ ప్రయాణికులపై కరోనా ఆంక్షలు కొనసాగిస్తున్నాయి. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్టు సర్టిఫికెట్ ఉంటే వీసా ఇస్తున్నాయి. అకడమిక్ ఇయర్ ప్రారంభ సమయం కావడంతో విదేశాల్లో చదువుకునేందుకు వెళ్తున్న స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ వ్యాక్సిన్ కోసం హాస్పిటళ్లను సంప్రదిస్తున్నారు. ప్రభుత్వ దవాఖాన్లతో పాటు, ప్రైవేటు దవాఖాన్లలో కూడా ఎక్కడా వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. మన రాష్ట్రంలో ఫస్ట్ డోసు మాత్రమే తీసుకుని, సెకండ్ డోసు ఇంకా తీసుకోని వాళ్లు 9 లక్షల మంది ఉన్నారు. బూస్టర్ డోసు తీసుకోవాల్సిన వాళ్లు సుమారు 1.9 కోట్ల మంది ఉన్నారు. బయోలాజికల్–ఈ నుంచి కొర్బెవ్యాక్స్ వస్తే, బూస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డోసుగా ఇవ్వడానికి ఉపయోగపడుతుందని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఫస్ట్ రెండు డోసులు ఏ వ్యాక్సిన్ తీసుకున్నా, బూస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డోసుగా కొర్బెవ్యాక్స్ తీసుకునే వెసులుబాటు ఉంది. కానీ, సెకండ్‌‌‌‌‌‌‌‌ డోసుగా మాత్రం, ఫస్ట్‌‌‌‌‌‌‌‌ డోసు ఏ వ్యాక్సిన్ తీసుకుంటే అదే వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సెకండ్ డోసు వాళ్ల కోసం కొంత మొత్తంలో కొవ్యాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ కొనుగోలు చేసి, ప్రతి జిల్లాలో ఏదో ఒక ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉంచితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్లు సూచిస్తున్నారు.