హనీమూన్ హత్య కేసు : సోనమ్ బెయిల్ పై జోక్యం చేసుకోలేం అన్న సుప్రీంకోర్టు

 హనీమూన్ హత్య కేసు : సోనమ్ బెయిల్ పై జోక్యం చేసుకోలేం అన్న సుప్రీంకోర్టు

పెళ్లి చేసుకుని.. భర్తతో కలిసి హనీమూన్ వెళ్లి.. అక్కడే  భర్తను చంపేసిన సోనమ్ రఘువంశీ కేసు తెలుసు కదా.. ఈ హత్య కేసులో సోనమ్ రఘువంశీకి మేఘాలయ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ బెయిల్ ను రద్దు చేయాలని.. ఆమెను మళ్లీ జైలుకు పంపించాలంటూ మేఘాలయ పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లారు.

ఈ కేసుపై విచారణ చేసిన సుప్రీంకోర్టు.. హనీమూన్ లో భర్తను చంపిన సోనమ్ కు బెయిల్ రద్దు చేయలేం అని.. బెయిల్ పై స్టే ఇవ్వలేం అని స్పష్టం చేసింది. ఈ కేసులో సోనమ్ ఇప్పటికే జైలు నుంచి విడుదల అయ్యారని.. ఈ దశలో బెయిల్ విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఆమె ఇప్పటికే విడుదల అయ్యి ఉంటే.. మేం జోక్యం చేసుకోవాలనుకోము అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నివాసి అయిన సోనమ్.. వ్యాపారవేత్త అయిన రాజా రఘువంశీని పెళ్లి చేసుకున్నది. 2025, మే నెలలో హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అక్కడే కొంత మంది కిరాయి హంతకులతో కలిసి భర్త రఘువంశీని చంపినట్లు కేసు నమోదు అయ్యింది. ఆ తర్వాత మేఘాలయ పోలీసులు అరెస్ట్ చేశారు. జైలుకు పంపించారు. అప్పటి నుంచి జైలులో ఉన్న సోనమ్.. ఇటీవలే మేఘాలయ ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ తో.. బయటకు వచ్చారు. 

సోనమ్ బెయిల్ ను సవాల్ చేస్తూ మేఘాలయ పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. విచారణ సందర్భంగా ఇప్పటికే చాలాసార్లు సోనమ్ ను విచారించారని.. ఇంకా ఆమె నుంచి రాబట్టటానికి ఎలాంటి విషయాలు లేవని.. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం లేదని నిర్థారించుకున్నాకే ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసిందని సోనమ్ తరపు లాయర్ వాదించారు. ట్రయల్ కోర్టు, మేఘాలయ హైకోర్టు తీర్పులను పరిశీలించిన సుప్రీంకోర్టు.. సోనమ్ బెయిల్ బయట ఉన్నట్లయితే.. ఈ అంశంలో జోక్యం చేసుకోలేం అని స్పష్టం చేస్తూ.. విచారణను వాయిదా వేసింది.