బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. రైతు వేదికల వద్ద పంచాయితీ

బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్..   రైతు వేదికల వద్ద పంచాయితీ

హైదరాబాద్: రేవంత్ ఉచిత విద్యుత్ కామెంట్ల మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గ్రామాలోలని రైతు వేదికల వద్ద బీఆర్ఎస్ సమావేశాలు నిర్వహిస్తున్నది. ఈ సమావేశాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతనిధులు హాజరై బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను వివరించడంతోపాటు కాంగ్రెస్ ఉచిత విద్యుత్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని చెప్పే ప్రయత్నం చేస్తున్నది. గ్రామాల్లోకి కాంగ్రెస్ నాయకులను రానీయవద్దని మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కాంగ్రెస్ సైతం ఇదే స్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నది. 24 గంటల కరెంటు కు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, అసలు ఉచిత విద్యుత్ కు పేటెంట్ తమ పార్టీ యేనని చెప్పే ప్రయత్నం చేస్తున్నది. 

మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నిర్వహించే సమావేశాల వద్ద నిరసన తెలుపాలని నిర్ణయించింది. ప్రతి రైతు వేదిక వద్ద వెయ్యి మంది రైతులతో సమావేశం నిర్వహించి కాంగ్రెస్ వైఖరిని వివరించాలని, ఉచిత కరెంటుపై కాంగ్రెస్ వైఖరి వెల్లడయ్యేంత వరకు ఆ పార్టీ నేతలను ఊళ్లలోకి రానీయొద్దని పిలుపునిస్తున్నారు. దీంతో పరిస్థితి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారింది. పోటా పోటీ ఆందోళనలు జరుగుతున్నాయి. హుజూరాబాద్ లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి దిష్టబొమ్మకు పాడె కట్టి శవయాత్ర నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా ఓబ్లాయిపల్లిలో రైతు వేదిక వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా పలువురు రైతులతో మాట్లాడించారు. వాళ్లు కాంగ్రెస్ తీరుపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ఆందోళనలపై కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇస్తోంది. తమకు కేటీఆర్ లా వాస్తవాలను వక్రీకరించడం తెలియదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. 2018 ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు చేయలేదని ఆరోపించారు. రైతు బంధు పథకాన్ని కేవలం ఐదెకరాలకే పరిమితం చేశారని, ఇదేనా బీఆర్ఎస్ కు రైతులపై ఉన్న చిత్తశుద్ధి అని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బీఆర్ఎస్ లో ఉన్న 16 మంది మంత్రుల్లో 15 మంది టీడీపీ వాళ్లేనని అన్నారు. మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ మంత్రి కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ కు బుడ్లు, బెడ్లు, దుడ్లు తప్ప ఏమీ తెలియదన్నారు. ఆయనకు వ్యవసాయం గురించే తెలియదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారని అన్నారు.  కేసీఆర్ సీఎం అయ్యాక విద్యుత్ ఉత్పాదన ఎక్కడ పెరిగిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదే జరిగి ఉంటే సబ్ స్టేషన్స్ వద్ద లాగ్ బుక్స్ ఎందుకు దాచి పెడుతున్నారని ప్రశ్నించారు. రైతు వేదికలకు వస్తున్న బీఆర్ఎస్ నేతలను నిలదీయాలని పొన్నం రైతులకు పిలుపునిచ్చారు.

లాగ్ బుక్స్ పరిశీలిస్తున్న కాంగ్రెస్

రైతు వేదికల వద్ద బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సబ్ స్టేషన్లకు తరలివెళ్లి లాగ్ బుక్ లను పరిశీలిస్తున్నారు. చాలా సెంటర్లలో రెండు మూడు సెంటర్లకు సంబంధించిన వివరాలు మాత్రమే ఉండటం గమనార్హం. పాత లాగ్ బుక్ లను ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారని, అసలు విషయాన్ని ప్రభుత్వం దాచిపెడుతోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. వరంగల్ జిల్లాలో పలు సబ్ స్టేషన్లను సందర్శించిన కాంగ్రెస్ నేతలు సందర్శించి వివరాలను పరిశీలించారు.