సర్పంచ్పై బీఆర్​ఎస్​ లీడర్ల దాడి 

సర్పంచ్పై బీఆర్​ఎస్​ లీడర్ల దాడి 
  • వెంచర్ల అక్రమాలపై ఫిర్యాదు చేయడంతో అటాక్​
  • దవాఖానలో చేరిన బాధితుడు 

ఊర్కోండ (నాగర్​ కర్నూల్​), వెలుగు: ‘మా వెంచర్ల మీద కంప్లయింట్​ చేస్తావా’ అంటూ కొంతమంది బీఆర్ఎస్ ​లీడర్లు..నర్సంపల్లి సర్పంచ్, బీజేపీ ఓబీసీ సెల్​ జిల్లా వైస్ ప్రసిడెంట్ ​నిరంజన్​పై​ దాడి చేశారు. నాగర్​ కర్నూల్​జిల్లా ఊర్కొండలోని మహబూబ్​నగర్–కోదాడ​మెయిన్​ రోడ్డుకు రెండు వైపులా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రధాన అనుచరుడు, బీఆర్ఎస్ లీడర్​ముచ్చర్ల జనార్దన్​రెడ్డి ఎంజేఆర్​ పేరిట వెంచర్​ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ తీర్మానం, అనుమతి లేకుండా వెంచర్లు వేశారని, ప్రభుత్వ రోడ్లను కబ్జా చేశారని బీజేపీ లీడర్లు..రెవెన్యూ, డీటీసీపీ ఆఫీసర్లకు కంప్లయింట్ ​చేశారు. దీంతో శుక్రవారం డీటీసీపీ రీజనల్​ డైరెక్టర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు వెంచర్ల పరిశీలనకు వచ్చారు. నర్సంపల్లి సర్పంచ్ ​నిరంజన్​తో పాటు బీజేపీ లీడర్లకు సమాచారం ఇచ్చి రమ్మన్నారు.

దీంతో వారు వచ్చి ఆఫీసర్లకు వివరిస్తుండగా బీఆర్ఎస్​ పార్టీ  నాయకులు నిరంజన్ తో పాటు ఇతర బీజేపీ లీడర్లతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కోపంతో నిరంజన్​ను కిందపడేసి తన్నారు. నిరంజన్ గాయపడగా అతడిని బీజేపీ నాయకులు కల్వకుర్తి గవర్నమెంట్​హాస్పిటల్​కు తరలించారు. అక్కడి నుంచి మహబూబ్​నగర్​ జిల్లా పార్టీ అధ్యక్షుడు వీరబ్రహ్మంతో కలిసి ఊర్కొండ పీఎస్​లో సింగిల్ విండో డైరెక్టర్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి, ఎంపీపీ భర్త జంగయ్య, ఊర్కొండ సర్పంచ్ రాజు, కల్వకుర్తి వార్డు మెంబర్ ​భర్త బావండ్ల మధు, కొమ్ము శ్రీను, నరేశ్, సందీప్ తదితరులపై కంప్లయింట్​ఇచ్చాడు. కొద్దిసేపటికే అస్వస్థతకు గురికాగా మహబూబ్​నగర్ ​జిల్లా దవాఖానకు తరలించారు. కాగా, బీఆర్ఎస్​ దాడిని నిరసిస్తూ బీజేపీ లీడర్లు  కోదాడ–మహబూబ్​నగర్​ మెయిన్​రోడ్డుపై రాస్తారోకో చేశారు.