జగిత్యాల, వెలుగు: జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎం రేవంత్ రెడ్డిని కలిశాను తప్పితే పార్టీ మారలేదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనేనని, మొన్నటి వరకు తన గౌరవ వేతనం నుంచే బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ కూడా ఇచ్చానని తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడంలో తప్పేమీ లేదన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని, తాను పార్టీ మారానని సీఎం గానీ, ఇతర కాంగ్రెస్ నాయకులు గానీ ఇప్పటివరకు ఎక్కడా ప్రకటించలేదని గుర్తుచేశారు.
సీఎంను కలిసిన అంశంపై బీఆర్ఎస్ పార్టీ తనను ఎలాంటి సంజాయిషీ అడగలేదని, తన ఇంటిపై, హాస్పిటల్‌పై దాడులు జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బిల్లుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ విప్ జారీ చేస్తే, పార్టీ నిర్ణయాలకు అనుగుణంగానే తాను నడుచుకుంటానని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో తన మద్దతు కోరిన అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు.
