రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి టికెట్ఆశిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. సెగ్మెంట్లలో తమకు ఎదురులేకుండా చూసుకుంటున్నారు. తమకు పోటీ అని భావించే లీడర్లను కొంతకాలంగా అణగదొక్కుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గాల్లో ఆయా లీడర్లు లేకుండానే శంకుస్థాపలు, ప్రారంభోత్సవాలు చేయడం, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడం, పార్టీ లీడర్లు, క్యాడర్‌ను కలవకుండా అడ్డుకోవడం, జడ్పీ, మున్సిపల్అధ్యక్షులు ఉన్న చోట వాళ్ల విధుల్లో జోక్యం చేసుకోవడం, ఆఫీసర్లు, లీడర్ల ముందు అవమానించడంలాంటి చర్యలతో పొమ్మనలేక పొగపెడ్తున్నారు. మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలనూ ఇందుకు వినియోగించుకుంటున్నారు. చాలా నియోజకవర్గాల్లో, ముఖ్యంగా హైకమాండ్ సర్వేల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన చోట్ల ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో అవకాశం ఉన్నవాళ్లు హైకమాండ్ వద్దకు వెళ్లి గోడు వెల్లబోసుకుంటుంటే, ఆ అవకాశం లేనివాళ్లు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. జగిత్యాలలో మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి రాజీనామా తర్వాత ఇలాంటి ఉదంతాలు ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయి.
భోగ శ్రావణి ఇష్యూతో బయటికి..
జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పదవికి ఇటీవల రిజైన్ చేసి బయటకు వచ్చిన భోగ శ్రావణి ఎమ్మెల్యే సంజయ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. బీసీల్లో బలమైన సామాజిక వర్గానికి చెందిన శ్రావణికి మంచి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉండడంతో ఆమె వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ఆశించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సంజయ్ మూడేండ్లుగా తనను వేధించడమే పనిగా పెట్టుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అధికార, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించకుండా అవమానించడంతో పాటు తన విధులనూ అడ్డుకోవడంతో విధిలేక బయటకు వస్తున్నట్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ తర్వాత అనేక నియోజకవర్గాల్లో ఇలాంటి ఉదంతాలు బయటకు వస్తున్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావుపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు సర్వేల్లో తేలడంతో బీసీ వర్గానికి చెందిన మంచిర్యాల, నస్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్లు గాజుల ముఖేశ్ గౌడ్, తోట శ్రీనివాస్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎమ్మెల్యే దివాకర్‌రావు అడుగడుగునా అడ్డుతగులుతున్నారు. ఇటీవల ఆయన తీరు భరించలేక ఇద్దరూ పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం నుంచి తనకు పోటీకి రావచ్చునన్న భావనతో పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణిని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కొంతకాలంగా దూరం పెడుతున్నారు.
పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదు. ప్లెక్సీల్లో ఆమె ఫొటో లేకుండా చేస్తున్నారు. నిర్మల్ లో సీనియర్ నేత వి. సత్యనారాయణ గౌడ్ ను కొంతకాలంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దూరం పెడుతున్నారు. కేసీఆర్‌కు సన్నిహితుడైన సత్యనారాయణగౌడ్ కు నామినేటెడ్ పదవులు కూడా దక్కకపోవడానికి మంత్రే కారణమనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే గౌడ్ బీజేపీ లో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్.. తనకు పోటీ అని భావిస్తున్న గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణిని తన నియోజకవర్గ పరిధిలో జరిగే ఏ కార్యక్రమానికీ ఆహ్వానించడం లేదు. ప్రోటోకాల్ పాటించకుండా అవమానించిన ఘటనలు ఉన్నాయి. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, లీడర్లు ఎవరూ ఆమె వెంట తిరగకుండా కట్టడి చేస్తున్నారు. ఎమ్మెల్సీ, మేయర్ నిర్వహించే కార్యక్రమాల ఫ్లెక్సీలను కూడా పలుమార్లు ఎమ్మెల్యే అనుచరులు చింపివేశారు. నన్నపనేని నరేందర్ పోరు భరించలేకనే ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారన్న వాదనలున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ ప్రసాద్ రాజకీయంగా తనకు అడ్డు వస్తాడనే భయంతో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆయనకు చెక్ పెడుతున్నారు. నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు కొడుకైన భరత్ జడ్పీ చైర్మన్ కాకుండా రెండుసార్లు ఎమ్మెల్యే అడ్డుపడ్డారు.
ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కొడుకు నాగర్కర్నూల్అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తనకు పోటీ రావచ్చనే అనుమానంతో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ తనకు పోటీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యను దూరం పెట్టారు. దీంతో కనకయ్య మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్గంలో చేరి.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీకి రెడీ అవుతున్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును పార్టీ కార్యక్రమాలకు పిలవట్లేదు. గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి జడ్పీ చైర్పర్సన్ సరితను జిల్లాలో తిరగనివ్వడంలేదు. అధికారిక కార్యక్రమాలకు పిలవడంలేదు. ఎమ్మెల్యేతో పాటు జడ్పీ వైస్ చైర్పర్సన్ సరోజమ్మ మాత్రమే పాల్గొంటున్నారు. ఇటీవల మల్దకల్ మండలం పెద్ద తాండ పంచాయతీ బిల్డింగ్ ప్రారంభోత్సవ శిలాఫలకంపై సరిత పేరును ప్లాస్టర్ తో బ్లాక్చేయడంతో నిరసన వ్యక్తం చేస్తూ ఆమె మధ్యలోనే వెళ్లిపోయారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్ రావుకు, తెలంగాణ మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు మధ్య తీవ్ర వైరం నెలకొంది. ఎమ్మెల్యే మాణిక్ రావు అధికారిక కార్యక్రమాలకు శ్రీనివాస్‌ను పిలవడంలేదు.
సర్వే రిపోర్టులతో షురూ.. .
దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్ఎస్ పెద్దల్లో వణుకు మొదలైంది. ‘వెనుక కేసీఆర్ బొమ్మ ఉంటే చాలు, ముందు క్యాండిడేట్ ఎవరైనా గెలుపు ఖాయం’ అని అప్పటిదాకా భావించిన హైమాండ్ తీరులోనూ మార్పు వచ్చింది. బీజేపీ బలపడ్తున్న టైంలో దీటైన క్యాండిడేట్లు లేకపోతే గెలుపు అనుకున్నంత ఈజీ కాదని అర్థమైంది. ఈక్రమంలోనే ప్రశాంత్ కిషోర్ టీమ్‌తో గతేడాది జూన్‌లో చేయించిన సర్వేలో 40కి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు రిపోర్ట్ వచ్చింది. ఆ తర్వాత ఇంటెలిజెన్స్, ఇతర ప్రైవేట్ ఏజెన్సీలతో చేయించిన సర్వేల్లోనూ ఇదే తేలింది. కానీ ఈ రిపోర్టులతో సంబంధం లేకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖాయమని పలుమార్లు సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పినప్పటికీ ఎమ్మెల్యేల మనసులో ఏదో ఓ మూల అనుమానం వెంటాడుతోంది. హైకమాండ్ నుంచే ఈ రిపోర్టులు మీడియాకు లీకవడమే ఇందుకు కారణం. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సిట్టింగులకు సీట్లు ఇవ్వబోమని ముందే చెప్తే సెగ్మెంట్లలో గ్రూపు రాజకీయాలను తామే ఎగదోసినట్లు అవుతుందని భావించే సీఎం జాగ్రత్తపడ్తున్నారనే టాక్ నడుస్తోంది. దీంతో ఎమ్మెల్యేలు తమ జాగ్రత్తలో తాము ఉంటున్నారు.
