ఐపీఎల్ 19వ సీజన్‌ను స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ థ్రిల్లింగ్ విక్టరీతో షురూ చేసింది. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచులో గుజరాత్ టైటాన్స్‌పై మూడు వికెట్ల తేడా విజయం సాధించింది. కానీ ఈ విజయానందం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఎంతో సేపు నిలవలేదు. మ్యాచులో గాయపడిన బాధ నుంచి తేరుకోకముందే అయ్యర్‌కు మరో షాక్ తగిలింది.
గుజరాత్‌తో జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేట్ కారణంగా అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా విధించింది ఐపీఎల్ మేనేజ్మెంట్. గుజరాత్‌తో జరిగిన మ్యాచులో తమ 20 కోటా పూర్తి చేయడానికి పంజాబ్ దాదాపు రెండు గంటల సమయం తీసుకుంది. చివరి ఓవర్ వేసిన అర్షదీప్ సింగ్ నాలుగు వైడ్‌లు, ఒక నో-బాల్‌తో కలిపి మొత్తం 11 బంతులు వేశాడు. దీంతో ఈ సీజన్లో స్లో ఓవర్ రేటింగ్ కారణంగా జరిమానా ఎదుర్కొన్న తొలి కెప్టె్న్‌గా అయ్యర్ నిలిచాడు.
అయ్యర్‌కు గాయం
ఐపీఎల్ 19లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. పంజాబ్ ఇన్సింగ్స్‌లో రషీద్ ఖాన్ వేసిన 11 ఓవర్ 5వ బంతిని పంజాబ్ బ్యాటర్ కూపర్ కానలీ స్ట్రైట్ హిట్ ఆడాడు. బంతి నేరుగా వెళ్లి నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్ కుడిచేతి మణికట్టుకు బలంగా తగిలింది. దీంతో అయ్యర్ గ్రౌండ్లో కుప్పకూలిపోయాడు. గ్రౌండ్లో నేలపై పడుకోని నొప్పితో విలవిలాడిపోయాడు.
వెంటనే గ్రౌండ్లోకి పరిగెత్తుకొచ్చిన పంజాబ్ ఫిజియోలు అయ్యర్ ను పరీక్షించారు. బంతి తగిలిన చోట ఐస్ ప్యాకులు పెట్టడంతో పాటు పెయిన్ రిలీఫ్ స్ప్రే కొట్టారు. నొప్పితోనే తిరిగి బ్యాటింగ్ ప్రారంభించిన అయ్యర్ (18) కాసేపటికే ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయ్యర్ గాయపడి మైదానంలో కుప్పకూలిపోవడంతో పంజాబ్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రమాదం లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. గాయం తీవ్రంగా ఉంటే మాత్రం పంజాబ్‌కు ఇది భారీ ఎదురు దెబ్బే.
పంజాబ్ ఆల్ రౌండ్ షో:
ఇక, మ్యాచ్ విషయానికి వస్తే ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన పంజాబ్ ఘన విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్‌ను 3 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 రన్స్ చేసింది. గిల్ 39, బట్లర్ 38, ఫిలిప్స్ 25 రన్స్ చేశారు.
విజయ్ వైశాఖ్ మూడు వికెట్లతో రాణించగా.. చాహల్ రెండు వికెట్లు, యాన్సెన్ ఒక వికెట్ తీశారు. అనంతరం జీటీ విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ విజయవంతంగా ఛేదించి గెలుపుతో టోర్నీని ఆరంభించింది. కూపర్ కూనలీ అద్భుత ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ కు విజయాన్ని అందించడంతో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు.
