ఒరాకిల్ సడెన్‌గా 30వేల మంది టెక్కీలను ఎందుకు తీసేసింది.. అసలు మిస్టరీ ఏంటంటే..?

ఒరాకిల్ సడెన్‌గా 30వేల మంది టెక్కీలను ఎందుకు తీసేసింది.. అసలు మిస్టరీ ఏంటంటే..?

సాధారణంగా ఏదైనా కంపెనీ నష్టాల్లో ఉంటేనే ఉద్యోగులను తీసేస్తుంది. కానీ అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఒరాకిల్ విషయంలో స్టోరీ వేరే ఉంది. 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 17.2 బిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించినా.. ప్రపంచవ్యాప్తంగా 30వేల మంది ఉద్యోగులపై వేటు వేయడం ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యింది. అందులోనూ మన భారత్ నుంచే 12వేల మంది ఉండటం టెక్కీలను వణికిస్తోంది. ఇంతకీ లాభాల్లో ఉన్న కంపెనీకి ఈ లేఆఫ్స్ పిచ్చి ఎందుకు పట్టింది? దీని వెనుక ఉన్న అసలు కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

AI  పెట్టుబడులు..
ఒరాకిల్ ఇప్పుడు తన పాత డేటాబేస్ వ్యాపారం కంటే AI మౌలిక సదుపాయాల పైన పగబట్టినట్లుగా పెట్టుబడులు పెడుతోంది. ముఖ్యంగా OpenAI కోసం ఏఐ డేటా సెంటర్లను నిర్మించేందుకు 156 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందం కుదుర్చుకుంది. అంటే మన కరెన్సీలో ఈ డీల్ విలువ దాదాపు రూ.14 లక్షల కోట్లు. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 30 లక్షల స్పెషలైజ్డ్ చిప్స్ కొనాల్సి ఉంది. రెండేళ్ల క్రితం కేవలం 6.9 బిలియన్ డాలర్లు ఖర్చు చేసిన కంపెనీ.. ఈ ఏడాది ఏకంగా 50 బిలియన్ డాలర్లను కుమ్మరిస్తోంది. ఈ భారీ పెట్టుబడుల కోసం నిధులను సర్దుబాటు చేయడానికే ఉద్యోగుల సంఖ్యపై కోత విధిస్తోంది.

అప్పుల ఊబి.. 
ఒరాకిల్ నెత్తిన ప్రస్తుతం 108 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.10 లక్షల కోట్లు అప్పు ఉంది. ఈ అప్పును భరించలేక కంపెనీ సతమతమవుతోంది. ఉద్యోగులను తీసేయడం ద్వారా 10 బిలియన్ డాలర్ల నగదును ఆదా చేయాలని ప్లాన్ చేస్తోంది. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే.. ఒరాకిల్ అప్పులు తీరుస్తుందో లేదో అన్న భయంతో బ్యాంకులు కూడా కంపెనీకి కొత్తగా అప్పు ఇవ్వడం ఆపేశాయి. బార్క్లేస్ వంటి సంస్థలు ఒరాకిల్ క్రెడిట్ రేటింగ్‌ను జంక్ అంటే అత్యంత ప్రమాదకరం అనే స్థాయికి తగ్గించేస్తామని హెచ్చరించాయి. 2009 ఆర్థిక సంక్షోభం తర్వాత ఒరాకిల్ ఇంతటి గడ్డు కాలాన్ని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి.

కస్టమర్ హ్యాండిస్తే పరిస్థితి ఏంటి?
ఇంత రిస్క్ చేసి ఒరాకిల్ కడుతున్న డేటా సెంటర్లను వాడుకోవాల్సిన OpenAI.. ఇప్పుడు ఎన్విడియా నుంచి కొత్త చిప్స్ కోసం చూస్తోందనే వార్తలు ఒరాకిల్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఒకవేళ కస్టమర్లు హ్యాండిస్తే.. లక్షల కోట్లు పెట్టి కట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వృధా అయిపోతుంది. సాంకేతికత వేగంగా మారుతుండటంతో.. ఒరాకిల్ కొంటున్న చిప్స్ అవి వాడకంలోకి రాకముందే పాతబడిపోయే ప్రమాదం కూడా ఉందని టెక్ నిపుణులు అంటున్నారు. 

ఈ సంక్షోభం ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ సంపదను కూడా దెబ్బతీసింది. 2025 సెప్టెంబర్‌లో షేరు ధర 346 డాలర్లు ఉంటే.. ఇప్పుడు అది 146 డాలర్లకు పడిపోయింది. అంటే సగానికి పైగా విలువ ఆవిరైపోయింది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి, ఆర్థిక క్రమశిక్షణ పేరుతో ఒరాకిల్ తన సంస్థలోని వేలమంది ఉద్యోగులను బలిచేస్తోంది లేఆఫ్స్ పేరుతో. భవిష్యత్తులో ఏఐ ద్వారా అద్భుతాలు చేస్తామని కంపెనీ చెబుతున్నా.. ప్రస్తుతం ఆ సంస్థలో పని చేస్తున్న వేలాది మంది టెక్కీలకు మాత్రం ఇది చీకటి రోజుగానే మిగిలిపోనుంది.