సినీ బాక్సాఫీస్ వద్ద వెండితెరపై ప్రేమకథలకు కొదువలేదు. కానీ, కొందరు నటీనటులు మాత్రం సంప్రదాయాలకు భిన్నంగా తమకంటూ ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. ప్రస్తుతం బిటౌన్‌లో విడాకులు, బ్రేకప్‌ల వార్తలు జోరుగా వినిపిస్తున్న వేళ.. 12 ఏళ్లుగా పెళ్లి బంధంతో పనిలేకుండా, సహజీవనంతో ఒకరికొకరు తోడుగా నిలుస్తున్న ఓ జంట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నెట్టింట వీరి బంధం వైరల్ అవుతోంది.
12 ఏళ్ల అనుబంధం..
ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి కాలంతో సంబంధం లేదు, కేవలం మనసు కలిస్తే చాలు అని నిరూపిస్తున్నారు నటుడు రాహుల్ దేవ్, నటి ముగ్ధా గాడ్సే. ఈ జంట గత 2013 నుంచి సహజీవనంలో ఉన్నారు. ఇటీవల తాము కలిసి ప్రయాణించిన 12 ఏళ్ల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ముగ్ధా ఒక రొమాంటిక్ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఒక బెంచ్‌పై కూర్చుని ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటున్న ఆ ఫోటో చూస్తుంటే, వారి మధ్య ప్రేమ ఏమాత్రం తగ్గలేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. "12 ఏళ్లు.. ఎవరు లెక్కిస్తున్నారు రాహుల్ దేవ్" అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
విషాదం నుంచి కొత్త జీవితం వైపు
రాహుల్ దేవ్ వ్యక్తిగత జీవితం ఒక భావోద్వేగమైన మలుపు. 2009లో ఆయన భార్య రీనా దేవ్ కేన్సర్‌తో మరణించారు. ఆ విషాదం నుంచి కోలుకోవడం ఆయనకు అంత సులభం కాలేదు. తన కొడుకు సిద్ధార్థ్‌ను పెంచడంపైనే ఆయన దృష్టి పెట్టారు. అయితే, ముగ్ధా గాడ్సే ఆయన జీవితంలోకి ప్రవేశించాక కొత్త వెలుగులు వచ్చాయి. వయసులో రాహుల్ దేవ్ ముగ్ధా కంటే 14 ఏళ్లు పెద్దవారైనప్పటికీ, వారి మధ్య ఉన్న అవగాహన ముందు ఆ వయసు తేడా ఎప్పుడూ అడ్డంకి కాలేదు.
పెళ్లి ఎప్పుడు?
వీరిద్దరినీ తరచూ ఎదురయ్యే ప్రశ్న 'పెళ్లి ఎప్పుడు?'. దీనికి ఈ జంట చాలా స్పష్టమైన సమాధానం ఇస్తుంటారు. మేము ఇప్పటికే ఒకరితో ఒకరు పూర్తి నిబద్ధతతో ఉన్నాము. వివాహం అనేది కేవలం ఒక కాగితం మీద సంతకం లాంటిది. మా మనసులు కలిశాయి, మేము సంతోషంగా ఉన్నాము. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు అని వారు కుండబద్దలు కొట్టినట్లు చెబుతారు.
విలక్షణ నటుడుగా
రాహుల్ దేవ్ భారతీయ చిత్రసీమలో ఒక విలక్షణమైన నటుడు రాణిస్తున్నారు.. 2000వ సంవత్సరంలో 'ఛాంపియన్' సినిమాతో విలన్‌గా కెరీర్ మొదలుపెట్టారు. తొలి సినిమాకే ఫిలింఫేర్ ఉత్తమ విలన్ అవార్డుకు నామినేట్ అయ్యారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, పంజాబీ భాషల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా తెలుగులో 'సింహాద్రి', 'జై చిరంజీవ', 'మాస్' వంటి సినిమాల్లో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. బిగ్ బాస్ సీజన్ 10 హిందీలో పాల్గొని తన వ్యక్తిత్వంతో అభిమానులను సంపాదించుకున్నారు. ముగ్ధా గాడ్సే కూడా 'ఫ్యాషన్' సినిమాతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పెళ్లి బంధం లేకపోయినా, పదేళ్లకు పైగా అన్యోన్యంగా ఉండటం ఈ కాలంలో నిజంగా విశేషమే అని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
