టామ్ కామ్ సంస్థ ద్వారా విదేశాల్లో యువతకు జాబ్స్: మంత్రి వివేక్

టామ్ కామ్ సంస్థ ద్వారా విదేశాల్లో యువతకు జాబ్స్: మంత్రి వివేక్

హైదరాబాద్: తెలంగాణలో టామ్ కామ్ సంస్థ ద్వారా యువతకు విదేశాల్లో జాబ్స్ కల్పిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. బుధవారం (ఏప్రిల్ 1) మాసబ్ ట్యాంక్‎లోని TGIIC బిల్డింగ్‎ను మంత్రి వివేక్ సందర్శించారు. ఈ సందర్భంగా టామ్ కామ్ ఆఫీస్ కోసం ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ లీజుకు తీసుకున్న TGIIC బిల్డింగ్‎ను పరిశీలించారు. భవిష్యత్‎లో విదేశాల్లో ఉద్యోగాలు కల్పించే విద్యార్థులకు శిక్షణ ఇచ్చే విధంగా ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని సూచించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టామ్ కమ్ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 90 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే వారికి ఇక్కడ సరైన విధానంలో ట్రైనింగ్ ఇస్తామన్నారు. బయట దేశాలకు వెళ్లే విద్యార్థులకు అక్కడి కల్చరు, లాంగ్వేజ్‏పై శిక్షణ ఇస్తామని చెప్పారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం నెలకు రూ. 2 వేల స్కాలర్ షిప్ అందిస్తోందని.. ఇది విద్యార్థులకు మంచి అవకాశమని పేర్కొన్నారు.

 టీజీఐఐసీ వాళ్ల నుంచి ఈ బిల్డింగ్ లీజుకు తీసుకున్నామని.. ఇక్కడ విద్యార్థులకు కావలసిన విధంగా ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. జర్మనీలో ఉద్యోగాల గురించి తెలుసుకుంటాం.. డెలిగేషన్ వెళ్తుంది.. అక్కడ ఏ ఏ ఉద్యోగాలు అవసరమో తెలుసుకొని అవకాశాలు కల్పిస్తాం.. జర్మనీలో చాలా ఉద్యోగాలకు అవకాశం ఉందని చెప్పారు. 

►ALSO READ | శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ ప్రతాప్ శుక్లా 

ఇజ్రాయిల్‎లో నిర్మాణ రంగానికి కావాలసిన 1,000 మందికి ట్రైనింగ్ ఇచ్చామని తెలిపారు. జపాన్, జర్మనీలో నర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉందని..  రెండు లక్షల వరకు జీతాలు ఇస్తారని చెప్పారు. రాష్ట్రం నుంచి చాలామంది అక్కడికి వెళ్లి ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నారని.. వాళ్ల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వస్తుందని తెలిపారు.  విద్యార్థులు టామ్ కామ్‏లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.