లోక్సభలో విదేశీ విరాళాల బిల్లు వాయిదా.. విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి..?

లోక్సభలో విదేశీ విరాళాల బిల్లు వాయిదా.. విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి..?

విదేశీ నిధులు, విరాళాలను నియంత్రించేందుకు కేంద్రం తీసుకొచ్చిన బిల్లుపై లోక్ సభలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ప్రతిపక్ష పార్టీలు ముక్త కంఠంతో ఒక్కథాటిపైకి వచ్చి బిల్లును వ్యతిరేకించాయి. దీంతో  వివాదాస్పదమైన విదేశీ సహాయ నియంత్రణ సవరణ బిల్లును (FCRA Amendment Bill 2026) వాయిదా వేసింది. విపక్షాల భారీ నిరసనల మద్య బిల్లును వాయిదా వేసింది కేంద్రం.

ఎందుకు వ్యతిరేకత:

దేశంలోని వివిధ ఎన్జీఓలు, స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి నిధులు వస్తుంటాయి. స్థానికంగా సంస్థలు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు మద్ధతుగా ఆర్థిక సాయం అందిచేందుకు నిధులు అందిస్తుంటాయి. దీంతో చాలా వరకు ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలు పలు కార్యక్రమాలు చేపడుతుంటాయి. 

అయితే ఈ బిల్లు ద్వారా విదేశీ నిధులతో సంస్థల సృష్టించిన ఆస్తులపై కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఇవ్వాలని ప్రతిపాదించారు. ఎన్జీఓలు లేదా సంస్థలు FCRA నిబంధనలు ఉల్లంఘించినా, రిజిస్ట్రేషన్ గడువు ముగిసినా, ఆ సంస్థల విదేశీ నిధులు,  ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అధికారం ఉండేలా రూపొందించారు. ఆ ఆస్తులను ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయడం లేదా అమ్మటం, వచ్చిన డబ్బును కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమ చేయడం వంటి సవరణలు ఉన్నాయి.

ఈ ప్రతిపాదనలపై విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా కేరళలో ఎన్నికల సమయంలో ఈ బిల్లు తీసుకురావడం కుట్రపూరితమైనదిగా విమర్శిస్తున్నాయి. ఎన్జీఓలు, సివిల్ సొసైటీ సంస్థలపై దాడి చేసేందుకు ఈ బిల్లును తీసుకువచ్చారని ఆరోపిస్తున్నాయి. కేంద్ర వైఖరికి నిరసనగా పార్లమెంటు కాంప్లెక్స్ బిల్డింగ్ తో పాటు పార్లమెంటు ఆవరణలో కూడా ఆందోళన చేపట్టాయి. స్వచ్ఛంద సంస్థల గొంతు నొక్కే ప్రయత్నాన్ని కేంద్రం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశాయి.

ALSO READ : తెలంగాణ కష్టాలను పట్టించుకోండి: ఎంపీ వంశీకృష్ణ

విపక్షాల ఆరోపణలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, 'FCRA బిల్లుపై కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఇది ఏ మతం లేదా సంస్థపైనా కాదు. జాతీయ భద్రత,  జాతీయ ప్రయోజనాల కోసం విదేశీ నిధులను నియంత్రించడమే లక్ష్యం అని తెలిపారు. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య ప్రస్తుతానికి బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడం వాయిదా వేసింది కేంద్రం.